న్యూఢిల్లీ: భారరహిత స్థితిలో హెయిర్ కటింగ్ చేసుకున్న తొలి భారతీయుడిగా వ్యోమగామి శుభాన్షు శుక్లా(Shubhanshu Shukla) రికార్డు క్రియేట్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అతను తాజాగా క్షౌరం చేయించుకున్నాడు. ప్రస్తుతం డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి తిరుగు ప్రయాణమైన ఆయన మరికొన్ని గంటల్లో నేలపై దిగనున్నారు. అయితే స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనాట్ నికోల్ ఆయర్స్.. గ్రూపు కెప్టెన్ శుక్లాకు హెయిర్ కటింగ్ చేశారు. చాన్నాళ్లు క్వారెంటైన్లో ఉన్న ఆ వ్యోమగాములకు హెయిర్ కటింగ్ చాలా అవసరమైందని నికోల్ తెలిపారు. భూమికి వెళ్లిన తర్వాత ఎలా తాను హెయిర్ కటింగ్ బిజినెస్ పెట్టుకోవచ్చు అన్న విషయంపై జోకులు చేసుకున్నట్లు ఆమె చెప్పారు.
అమెరికా వైమానిక దళంలో ఆయర్స్ మేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె 122 రోజుల నుంచి అంతరిక్షంలో ఉంటోంది. సుమారు ఆరు గంటల పాటు ఆమె స్పేస్‌వాక్ నిర్వహించారు. స్పేస్ స్టేషన్‌కు వెళ్లడానికి ముందు శుభాన్షు శుక్లా 30 రోజుల పాటు కెన్నడీ స్పేస్ సెంటర్లో క్వారెంటైన్లో ఉన్నారు. పలుమార్లు శుక్లా నాసా ప్రయాణం వాయిదా పడిన విషయం తెలిసిందే.
స్పేస్ స్టేషన్లో కటింగ్ చేయించుకున్న శుక్లా అక్కడ స్నానం చేయలేదు. ఆ ల్యాబ్‌లో హాట్ లేదా కోల్డ్ వాటర్ అందుబాటులో ఉండదు. పచ్చి టవల్స్తోనే వ్యోమగాములు తమను తాము శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఐఎస్ఎస్ చేరుకున్న సమయంలో శుక్లాకు కొద్దిగా గడ్డం ఉండేది. కానీ ఇప్పుడు అతను గడ్డం గీయించుకుని శుభ్రం కనిపిస్తున్నాడు. స్పేస్ స్టేషన్లో షావర్స్ కానీ, బాత్‌టబ్‌లు కానీ, స్పాలు కానీ లేవని, టవల్‌కు కొంత నీరు, సబ్బు పెట్టి.. శరీరాన్ని శుభ్రం చేసుకుంటామని ఆస్ట్రోనాట్ థామస్ పీస్క్వెట్ తెలిపారు.