Crime news : మహిళా పేషెంట్ల (Women patients) కు అక్రమంగా అవసరంలేని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్లను ఇస్తూ.. అందుకు ప్రతిగా వారిని తన కోరిక తీర్చాలని లోబర్చుకుంటున్న భారత సంతతి వైద్యుడి (Indian origin doctor) ని అమెరికా (USA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూజెర్సీ (New Jersey) లోని సెకాకస్‌కు చెందిన 51 ఏళ్ల డాక్టర్ రితేష్ కల్రా (Ritesh Kalra) తప్పుడు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వాలంటే తన లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి చేసినట్లు పలువురు పేషెంట్లు ఫిర్యాదు చేశారు.
దాంతో ఆ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూఎస్ కోర్టులో విచారణ అనంతరం అతడిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డాక్టర్ రితేష్ కల్రా న్యూజెర్సీలోని సెకాకస్ ప్రాంతంలో ఫెయిర్ లాన్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అయితే అవసరం లేకపోయినప్పటికీ అడిగిన పేషెంట్లకు అతడు తన క్లినిక్‌లో ఆక్సికోడోన్ వంటి శక్తిమంతమైన డ్రగ్స్‌ను ఇస్తుండేవాడు.
అందుకు ప్రతిగా వారితో లైంగిక కోరికలు తీర్చుకునేవాడు. ఈ విధంగా అతడు 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 31 వేల కంటే ఎక్కువ ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్లను పేషెంట్లకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటికి అలవాటు పడినవారు తరచూ ఆ డ్రగ్స్ కోసం అతడిని సంప్రదించేవారు. అలా అడిక్ట్ అయ్యి వచ్చేవాళ్లను తన లైంగిక కోరిక తీర్చాలని బలవంతపెట్టేవాడు. దాంతో పలువురు పేషెంట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని కొందరు, లైంగిక దాడికి పాల్పడ్డాడని మరికొందరు తమ ఫిర్యాదులలో పేర్కొన్నారు.
డాక్టర్ రితేశ్ తన చర్యల ద్వారా చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా అధిక మోతాదు డ్రగ్స్ ఇచ్చి.. రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించాడని అధికారులు తెలిపారు. దాంతో రితేష్ కల్రా వైద్య లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు యూఎస్ కోర్టు వెల్లడించింది. అతడు తన క్లినిక్‌ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అతడు దోషిగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది.