బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 17, 2020 , 15:33:40

పీఓకేలో అక్రమ ఎన్నికలు : ఎవరికీ మెజారిటీ రాని వైనం

పీఓకేలో అక్రమ ఎన్నికలు : ఎవరికీ మెజారిటీ రాని వైనం

భారతదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. పాకిస్తాన్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అయితే ఏ పార్టీకి మెజారిటీ లభించలేదు. ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి 23 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో గెలిచినట్లు సమాచారం. మరికొన్నింటిలో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు పాకిస్తాన్‌ నుంచి వస్తున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. పాకిస్తాన్‌కు చెందిన జియో టీవీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పీటీఐకి 9, స్వతంత్రులకు 6, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కి 5, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి 2, జమాయట్ ఉలేమా-ఈ-ఇస్లాం ఫజల్ (జేఐయూ-ఎఫ్), మజ్లిస్ వహదాతుల్ ముస్లిమీన్ (ఎండబ్ల్యూఎం) పార్టీలకు చొరొక్కటి సీటు లభించింది. నలుగురు మహిళలు సహా మొత్తం 330 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటింగ్ ముగిసేలోపు పీటీఐ నాయకులు ఎన్నికలను రిగ్గింగ్ చేశారని పీపీపీ, పీఎంఎల్-ఎన్ పార్టీ నేతలు ఆరోపించారు.

గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఇది మూడవ ఎన్నిక. అక్కడ మొదటి ఎన్నికలు 2010 లో జరగ్గా.. పీపీపీ 15 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015 లో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌ 16 సీట్లు గెలుచుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ హైకోర్టు 2018 పరిపాలనా ఉత్తర్వులను సవరించడానికి, ఈ ప్రాంతంలో సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి ఆమోదం తెలిపింది. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్తాన్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. సైనిక ఆక్రమిత ప్రాంతంలో పరిస్థితిని మార్చడానికి తీసుకున్న చర్యలకు చట్టపరమైన ఆధారం లేదని భారత్ స్పష్టం చేసింది.

కార్టూన్ వివాదంలో కొనసాగుతున్న నిరసనలు

ఫ్రాన్స్‌లో కార్టూన్ వివాదంపై పాకిస్తాన్‌లో కొనసాగుతున్న నిరసనలు నిలిచిపోయినట్లు కనిపించడం లేదు. కార్టూన్‌కు వ్యతిరేకంగా రాజధాని ఇస్లామాబాద్‌లో నిరసన తెలిపేందుకు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-లాబ్‌బాయిక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ) మద్దతుదారులు ప్రయత్నించారు. టీఎల్‌పీ చీఫ్ మౌలానా ఖాదీమ్ హుస్సేన్ రిజ్వి నాయకత్వంలో రావల్పిండిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం, టీఎల్‌పీ మద్దతుదారులు 3000 మందికి పైగా రావల్పిండి నుంచి ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్ చేరుకున్నారు. అక్కడి పోలీసులు వారిని నిలువరించి ఆ ప్రాంతం దాటి వెళ్లకుండా అడ్డుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.