Hamas Chief’s wife : గాజా (Gaza) లోని హమాస్ (Hamas) ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ సేనల దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ (Yahya Sinvar) సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గత ఏడాది అక్టోబర్‌లో యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ బలగాలు తుదముట్టించాయి. అయితే సిన్వర్ హత్యకు ముందే యహ్యా సిన్వర్ భార్య పరారైందని తాజాగా తెలిసింది.
యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం టర్కీలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. సిన్వర్ మరణించడానికి చాలా ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయి. గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్‌ను రఫా బార్డర్ గుండా ఈజిఫ్ట్లోకి చేర్చిందని తెలిసింది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని, సాధారణ గాజా మహిళకు అంతమొత్తం చెల్లించే స్తోమత ఉండదని, ఈ విషయమే సమర్ పరారైన విషయాన్ని బయటపెట్టిందని అక్కడి మీడియా తెలిపింది.
గాజాకు చెందిన ఓ సామాన్య మహిళ పాస్పోర్టుతో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్టులోకి, అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని మీడియా పేర్కొంది. ఆ తర్వాత అక్కడి వ్యక్తిని వివాహం చేసుకుని, అక్కడే జీవిస్తోందని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్ వర్క్ సాయంతో జరిగిందని పేర్కొంది.