Israeli – Hamas : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వందలాది మంది బలవుతున్నారు. హమాస్ తీవ్రవాదులు గాజా(Gaza)లోని విదేశీయులతో పాటు చాలామందిని తమ వద్ధ బంధీలు(hostages)గా ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు సోమవారం అపహరణకు గురైన తమ పిల్లల ఫొటోలు ముద్రించి ఉన్న ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లి.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu)ను కలిశారు. హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్న తమ కుటుంబసభ్యులను విడిపించాలని ఆయనతో మొర పెట్టుకున్నారు. అవసరమైతే అందరికీ అందర్నీ విడిపించాలని వాళ్లంతా ప్రధానికి విన్నవించారు. అంటే… ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేసి.. మా పిల్లలందరినీ మాకు అప్పగించండి అని వాళ్లు నెతన్యాహును దీనంగా అభ్యర్థించారు. మరోవైపు ఖతర్, టర్కీ దేశాలు కూడా తమ దేశానికి చెందిన వాళ్లను ప్రాణాలతో వదిలేయండని హమాస్‌తో చర్చలు జరుపుతున్నాయి.
హమాస్ ఉగ్రమూకలన్ని ఏరిపారేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తున్నది. గాజాలో నివసిస్తున్న ప్రజలు ప్రాణ భయంతో చెల్లాచెదురవుతున్నారు. వేలాది మంది జనం గాజాలోని సహాయ కేంద్రాల వద్దకు చొచ్చుకొచ్చినట్లు ఐక్యరాజ్యసమతి (ఐరాస) తెలిపింది. పాలస్తీనియన్ శరణార్థుల కోసం యూఎన్ రిలీఫ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక గిడ్డంగులలో ఉన్న గోధుమలు, పిండి, ఇతర అత్యవసర వస్తువులను ప్రజలు దోచుకున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో గాజాలో ‘సివిల్ ఆర్డర్’ గాడి తప్పుతున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.