జెరూసలేం: హమాస్ (Hamas) ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన జర్మన్-ఇజ్రాయెల్ యువతి షానీ లౌక్ (23) మరణించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. షానీ లైక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు షానీ లౌక్ మృతదేహాన్ని గుర్తించాయని ఇజ్రాయెల్ సర్కారు వెల్లడించింది. షానీ కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
‘జర్మన్-ఇజ్రాయెల్ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని గుర్తించాం. ఆమె మృతి గురించి తెలిసి మా హృదయం ముక్కలైంది. షానీని మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ మిలిటెంట్లు అపహరించారు. ఆమెను తీవ్రంగా వేధించారు. తర్వాత గాజా నగరం మొత్తం పికప్ ట్రక్కులో నగ్నంగా ఊరేగించారు. హమాస్ చేతిలో ఆమె అంతులేని వేదనను అనుభవించారు. ఆమె పరిస్థితితో మా హృదయం ముక్కలైంది’ అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘మాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కారులో అపస్మారక స్థితిలో ఉన్న నా కుమార్తెను చూశాను. ఆ కారును గాజా నగరమంతా తిప్పడం కనిపించింది’ అని మృతురాలు షానీ తల్లి వాపోయింది.
కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్ జరిగిన ప్రాంతంలోనే 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 1400 మంది మరణించారు. దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు కొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 23 ఏళ్ల షానీ లౌక్ కూడా ఒకరు.