అంకారా: ఆమె సాదాసీదా మహిళ కాదు. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు. అయినా కూడా అవమానం తప్పలేదు. యురోపియన్ యూనియన్, టర్కీ అధ్యక్షుడి సమావేశంలో ఆమెకు కనీసం కుర్చీ కూడా వేయకపోవడం గమనార్హం. బుధవారం అంకారాలో జరిగిన సమావేశంలో యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలైన ఉర్సులా వాండెర్ లేయెన్‌కు ఈ అవమానం జరిగింది.
యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మిచెల్, ఇతర యురోపియన్ యూనియన్ అధికారులతో కలిసి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో సమావేశానికి ఆమె వెళ్లారు. మీటింగ్ హాల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ రెండే కుర్చీలు ఉన్నాయి. ఆ రెండింట్లో టర్కీ అధ్యక్షుడు, యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూర్చున్నారు. మరో కుర్చీ లేకపోవడంతో ఉర్సులా అవాక్కయ్యారు. ఇదేంటన్నట్లుగా సైగ చేస్తూ కొంతసేపటి వరకూ ఆమె హాల్లో అలా నిల్చుండిపోయారు.
కాసేపటి తర్వాత ఆమెను పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో కమిషన్ అధ్యక్షురాలు చాలా ఆశ్చర్యానికి గురైనట్లు ఈయూ ఎగ్జిక్యూటిక్ అధికార ప్రతినిధి ఎరిక్ మామర్ చెప్పారు. కౌన్సిల్, టర్కీ అధ్యక్షులలాగే ఆమెను కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టాల్సిందని ఆయన అన్నారు. దీనిపై కమిషన్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా.. టర్కీ మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించింది. మరోవైపు ఈ వీడియో యూరప్‌లో వైరల్‌గా మారింది. #GiveHerASeat అక్కడ టాప్ ట్రెండ్స్‌లో ఒకటిగా నిలిచింది. టర్కీలో మహిళల పరిస్థితి ఎలా ఉందో దీనిని బట్టే అర్థమవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"Ehm" is the new term for "that’s not how EU-Turkey relationship should be". #GiveHerASeat #EU #Turkey #womensrights pic.twitter.com/vGVFutDu0S
— Sergey Lagodinsky (@SLagodinsky) April 6, 2021