Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో విభేదాలపై బిలియనీర్ తాజాగా స్పందించారు.
ఈ మేరకు పశ్చాత్తాపం (Elon Musk regrets) వ్యక్తం చేశారు. గతవారం అధ్యక్షుడు ట్రంప్ గురించి తాను చేసిన కొన్ని పోస్టులు చాలా దూరం వెళ్లాయన్నారు. అందుకు తాను చింతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ ఓ పోస్టు పెట్టారు. ‘గత వారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి నేను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయి. అందుకు నేను చింతిస్తున్నాను’ అంటూ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025
కాగా, ఇటీవలే ట్రంప్ యంత్రాంగం తెచ్చిన ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ను మస్క్ వ్యతిరేకించడంతోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లు విషయంలో ట్రంప్‌పై మస్క్ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ‘మా బడ్జెట్లో నిధులను, బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలంటే సులభమైన మార్గం ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీలను, కాంట్రాక్టులను రద్దు చేయడమే’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టపోయి, 150 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో నష్టపోవడం టెస్లా చరిత్రలో ఇదే ప్రథమం. ఇది జరిగిన కొద్ది సేపటికి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించాలంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
మస్క్ పార్టీ ‘ద అమెరికా పార్టీ’?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత మస్క్ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని మస్క్ ‘ద అమెరికా పార్టీ’ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్‌లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
Also Read..
Errol Musk | నా కుమారుడు మస్క్‌పై ట్రంపే గెలుస్తారు : ఎర్రోల్ మస్క్
Elon Musk | ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ పేరు ఇదేనా..?