Elon Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవలే డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్.. బహిరంగంగానే ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య విభేదాలు కొత్త చర్చకు దారి తీశాయి.
ట్రంప్‌తో విభేదాల వేళ ఎలాన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఏర్పాటు గురించి మస్క్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. మధ్య వయస్కుల్లో 80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా..? అంటూ తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు. దీని కోసం పోల్ పెట్టారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025
400,000 మంది తన ప్రశ్నకు స్పందించారని.. అందులో 83 శాతం మంది మూడో, మధ్య స్థాయి పార్టీకి అనుకూలంగా స్పందించారని మస్క్ తెలిపారు. ‘ప్రజలు చెప్పారు. 80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80శాతం మంది అంగీకరించారు’ అని మస్క్ వెల్లడించారు. ఆ తర్వాత ‘ది అమెరికా పార్టీ’ (The America Party) అంటూ మస్క్ మరో పోస్ట్ చేశారు. తన కొత్త పార్టీకి మస్క్ ఇదే పేరు పెట్టబోతున్నారంటూ ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే, దీనిపై మస్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
Also Read..
Elon Musk | ట్రంప్‌తో విభేదాలు.. 14 శాతం పతనమైన టెస్లా షేర్లు.. మస్క్‌కు రూ.13 లక్షల కోట్ల నష్టం