ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోల్‌వాల్ట్ అథ్లెట్ అర్మండ్ మొండొ డుప్లంటిస్ మరోసారి చరిత్ర సృష్టించాడు. తన రికార్డులో తానే తిరగరాసుకుంటున్న 26 ఏండ్ల ఈ స్వీడన్ కుర్రాడు.. సొంతగడ్డపై జరిగిన మొండొ క్లాసిక్-2026లో రికార్డు స్థాయిలో 6.31 మీటర్ల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్వీడన్‌లోని ఉప్సాలాలో జరిగిన ఈ పోటీల్లో డుప్లంటిస్.. 5.65 మీటర్లు, 5.90 మీ., 6.08 మీ. ఎత్తును దూకిన అనంతరం అతడు బార్‌ను 23 సెంటిమీటర్లు (వరల్డ్ రికార్డు)కు పెంచాలని అడిగాడు.
తన తొలిప్రయత్నంలోనే 6.31 మీటర్లు ఎత్తుకు ఎగిరి.. నిరుడు తనపేరిటే ఉన్న 6.30 మీటర్ల రికార్డును అధిగమించాడు. 2020 నుంచి (6.17 మీ.) అతడు వరుసగా 14 సార్లు తన రికార్డును తానే తిరగరాసుకోవడం విశేషం. 2023 ఆగస్టు నుంచి పోల్‌వాల్ట్‌లో అతడికి ఇది వరుసగా 38వ విజయం కాగా సొంతగడ్డపై రెండో (2025 స్టాక్ హోమ్‌లో 6.28 మీ.) రికార్డు కావడం విశేషం. ఈ పోటీల్లో నార్వేకు చెందిన సొండ్రె 6 మీ. ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు.