Dmitry Medvedev | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మస్క్ మధ్య నెలకొన్న ఈ వైరం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) తాజాగా స్పందించారు.
ఇద్దరి మధ్య ‘శాంతి ఒప్పందం’ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ప్రతిపాదించారు. అయితే, అందుకు తనకు ఫీజు కావాలని (Starlink Stock As Fee) వ్యాఖ్యానించారు. ‘D (డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ), E (ఎలాన్ మస్క్) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు కొంచెం ఫీజు తీసుకుంటాం. స్టార్‌లింక్ షేర్లను ఆ ఫీజుగా స్వీకరిస్తాం. మీరు కొట్టుకోవద్దు’ అంటూ మెద్వెదేవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు టెస్లా బాస్ స్పందించారు. టెస్లా షేర్లు అడిగినందుకు నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
😂
— Elon Musk (@elonmusk) June 6, 2025
ట్రంప్ Vs మస్క్
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవలే డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్.. బహిరంగంగానే ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్-మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు.
ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కిల్ ది బిల్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది.
Also Read..
Elon Musk | ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ పేరు ఇదేనా..?