Errol Musk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవలే డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్.. బహిరంగంగానే ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్, మస్క్ మధ్య నెలకొన్న వైరంపై ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ (Errol Musk) తాజాగా స్పందించారు. ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు కారణంగానే వీరి మధ్య వివాదం తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. ట్రంప్ తీసుకువచ్చిన బిల్లుతో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యాడని.. అందుకే అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు.
‘ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మస్క్‌కు అసహనం పెరిగిపోయింది. అందుకే ట్రంప్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. కాంగ్రెస్, సెనేట్‌లో మెజారిటీ ఓట్లను పొందేందుకు అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మస్క్‌కు తెలియదు. దీన్ని మస్క్ అర్థం చేసుకోలేకపోయారు. ట్రంప్ దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ వివాదంలో మస్క్‌పై ఆయనే గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇరువురు తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా’ అని ఎర్రోల్ మస్క్ పేర్కొన్నారు. మాస్కోలో నిర్వహించిన ఒక ఫోరమ్‌లో ఎర్రోల్ మస్క్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చిచ్చుపెట్టిన బిల్లు..
అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్-మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కిల్ ది బిల్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది.
మస్క్ పార్టీ ‘ద అమెరికా పార్టీ’?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత మస్క్ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని మస్క్ ‘ద అమెరికా పార్టీ’ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్‌లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
మస్క్.. మా దేశానికి రండి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తీవ్ర విభేదాలు ఏర్పడిన క్రమంలో ఎలాన్ మస్క్‌కు రష్యా ఒక ఆఫర్ ఇచ్చింది. కావాలనుకుంటే మస్క్ తమ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందవచ్చునని రష్యన్ చట్టసభ సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహారాలపై స్టేట్ డుమా కమిటీ (రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్ట్ పార్టీ( మొదటి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి నోవికోవ్ ఆహ్వానించారని రష్యాన్ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
Also Read..
“వైట్ హౌస్ డేటా కొట్టేసిన మస్క్!”
“Elon Musk | ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ పేరు ఇదేనా..?”