Elon Musk | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖకు మస్క్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇప్పుడు డోజ్ నుంచి మస్క్ తప్పుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. డోజ్ బాధ్యతల నుంచి కొన్ని వారాల్లో మస్క్ వైదొలగనున్నట్లు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ముగ్గురు సన్నిహితులతో పాటు కేబినెట్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
అయితే, ఈ వార్తలపై వైట్‌హౌస్ (White House)తోపాటు మస్క్ కూడా తాజాగా స్పందించారు. ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేశారు. ‘ఎలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ డోజ్‌లో అద్భుతమైన పనిని పూర్తిచేస్తారు. ఆ తర్వాతే ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా సేవ నుంచి మస్క్ తప్పుకుంటారు’ అని వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇక మస్క్ సైతం ఆ వార్తలను ఖండించారు. డోజ్ నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అది ఫేక్ న్యూస్ అంటూ కరోలిన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఎలాన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో డోజ్‌లో మస్క్ ఉద్యోగి కాదని, ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేవని శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే మస్క్ ఆ బాధ్యతలు చూస్తున్నారని వెల్లడించింది.
Also Read..
Tariffs | ట్రంప్ 26 శాతం సుంకాలు.. భారత్ స్పందన ఇదే
Trump Tariffs | సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే..?
Donald Trump | ట్రంప్ టారీఫ్‌ల మోత.. భారత్‌పై ఎంతంటే?