Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార పన్నులను ప్రకటించారు. ఒక్కో దేశానికి ఒక్కో టారిఫ్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ట్రంప్ పన్నులపై స్పందించారు. కొన్ని దేశాలు సుంకాలను సమర్థించగా.. చాలా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ దశాబ్దాలుగా అమెరికాతో చేస్తున్నట్లే తన వాణిజ్య భాగస్వాములతో కూడా అమెరికా అదే చేస్తుందని అన్నారు. ఇకపై అలా జరుగదన్నారు. ఉద్యోగాలు, కంపెనీలు తిరిగి అమెరికాకు వస్తాయన్నారు. ఇది ఆర్థిక సమస్యగా మాత్రమే కాకుండా జాతీయ భద్రతా సమస్యగా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ ప్రతీకార సుంకాలకు బ్రిటన్ మద్దతు తెలిపింది. అమెరికా బ్రిటన్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. ట్రంప్ ప్రకటించిన బ్రిటిష్ వస్తువులపై 10 శాతం సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి బ్రిటన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నట్లు వాణిజ్య కార్యదర్శి జోనాథన్ తెలిపారు. ఎవరూ వాణిజ్య యుద్ధాన్ని కోరుకోరని, ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ఉద్దేశమని.. బ్రిటన్ జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్‌పై 20శాతం సుంకాలు విధించడం తప్పుడు నిర్ణయమని ఇటాలియన్ ప్రధానమంత్రి గియోర్డానో మెలోని పేర్కొన్నారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని మెలోని ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. సుంకాల విషయాన్ని డబ్ల్యూటీవో ప్రస్తావిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచిస్తున్నామని చెప్పింది. బ్రెజిల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. దాంతో బ్రెజిలియన్ వస్తువులపై సుంకాలు విధించే ఏ దేశం, వాణిజ్య సముదాయంపైనైనా ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుంటుంది.
అమెరికా సుంకాలను ఆస్ట్రేలియా వ్యతిరేకించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రతీకార సుంకాలు ఏమాత్రం సరికాదన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉన్నాయని.. ఇది ఓ స్నేహితుడు చేసే పరికాదన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధి, నార్ఫోక్ ఐలాండ్ అడ్మినిస్ట్రేటర్ జార్జ్ ప్లాంట్ మాట్లాడుతూ.. నార్ఫోక్ ఐలాండ్ చిన్న దక్షిణ పసిఫిక్ అవుట్‌పోస్ట్‌పై విధించిన 29శాతం సుంకం షాక్ ఇచ్చిందని అన్నారు. తాము అమెరికాకు ఏమీ ఎగుమతి చేయడం లేదని, సుంకాలు విధించడం లేదన్నారు. ఇటలీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ స్టడీస్‌లో సీనియర్ విశ్లేషకుడు మాటియో విల్లా మాట్లాడుతూ.. ట్రంప్ అధికంగా సుంకాలు విధిస్తే యూరప్ స్పందించాల్సి ఉంటుందన్నారు. కానీ, ఈయూ ఏమీ చేయకుండా ఉండడం మంచిదని.. ప్రతీకారం కచ్చితంగా అమెరికాకు మరో దెబ్బ అవుతుందన్నారు. కానీ, అది యూరప్‌ను మరింత దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఈయూ అమెరికాకు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుందన్నారు. ట్రంప్ బలప్రయోగ భాషను మాత్రమే అర్థం చేసుకుంటారని.. తక్షణ ప్రతిస్పందన అవసరమని విల్లా పేర్కొన్నారు. ట్రంప్ త్వరలో చర్చలు జరిపి.. సుంకాలు వెనక్కి తీసుకునేలా చూడాలని ఆకాంక్షించారు.