Donald Trump | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకున్న అధికారాలతో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఫెడరల్ మరణశిక్షను (Death Penalty) ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే.
అయితే, బైడెన్ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రేపిస్టులు, హంతకులకు మరణ శిక్ష అమలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంపై న్యాయ శాఖను ఆదేశిస్తానని తెలిపారు. దేశంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని వెల్లడించారు.
మరణశిక్షలకు సంబంధించి అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. మొత్తం 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేశాయి. మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష అమలవుతోంది. అయితే, తోటి ఖైదీలను హతమార్చిన వారికి, బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి. 1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించగా.. కేవలం 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు. అందులోనూ ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయ్యాక ఆరు నెలలలోనే 13 మందికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం మరణ శిక్ష పడిన ఖైదీల సంఖ్య 40 ఉండగా.. వీరిలో 37 మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు.
Also Read..
“Donald Trump | హష్ మనీ కేసు.. ట్రంప్‌కు భారీ షాక్”
“Donald Trump | అమెరికా కొంటుంది.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను!”
“ఏఐ అడ్వైజర్‌గా శ్రీరామ్ కృష్ణన్”