Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏం చేసినా సంచలనమే అవుతుంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తన పాలన ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచిచూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు (3rd Presidential Term) కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదని వ్యాఖ్యానించారు.
ఇంటర్వ్యూలో భాగంగా మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా..? అందుకు ఏమైనా వ్యూహాలున్నాయా..? అన్న ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. ఇందుకు ఆయన సమాధానమిస్తూ.. ‘రాజ్యాంగం అనుమతించకపోయినా.. మూడోసారి అధ్యక్షుడు కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు. నన్ను మూడోసారి కూడా అధ్యక్షుడిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే, దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తీ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిని అధిష్ఠించడానికి వీల్లేదు. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలంటే 22వ రాజ్యాంగ సవరణను మార్చాల్సి ఉంటుంది. దానికి అమెరికా కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ ఒక్కరే నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి 1951లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చారు.
అయితే, ట్రంప్ మాత్రం మూడోసారి, వీలైతే నాలుగోసారి కూడా అమెరికాను ఏలాలని కలలు కంటున్నారు. మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడంపై ఆయన ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ పాలక రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు యాండీ ఓగిల్స్ దిగువ సభలో ఇటీవలే సంయుక్త తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది ఆమోదం పొందితే డొనాల్డ్ ట్రంప్ మూడుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి వీలు కలుగుతుంది.
Also Read..
Ants | చిట్టి చీమలు.. మానవాళికి పెద్ద మిత్రులు.. ఇండ్లలోకి ఎందుకు వస్తాయో తెలుసా!
Molecular Plastics | ఉప్పు నీటిలో కరిగే ప్లాస్టిక్.. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు
Earthquake | భూ ప్రకోపం తీరని శాపం.. మానవాళిపై పెను ప్రభావం