Ants | సిడ్నీ, మార్చి 30 : ప్రకృతిలోని గొప్ప శ్రమ జీవుల గురించి ప్రస్తావించాలంటే అందులో చీమలకు తప్పక స్థానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 22 వేల రకాల చీమ జాతులుండగా, అందులో ఉష్ణమండల ఆస్ట్రేలియాలోనే 5 వేల రకాలుంటాయని అంచనా. కొంతమంది చీమలంటే భయపడతారు, వాటిని చంపాలని చూస్తారు. అయితే వాస్తవానికి అవి పర్యావరణానికి, మానవాళికి సాయం చేసేవే తప్ప హానికరమైనవి కావని జీవ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చీమలు మన ఇండ్లలో తరచూ ఎలా దర్శనమిస్తాయి? ఎంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో కూడా అవి ఎలా చొరబడతాయి? అవి ఇళ్లలోకి రాకుండా ఏం చేయాలో తెలుసుకోవడం అవసరమని పరిశోధకులు చెప్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి 25 లక్షలు చొప్పున చీమలు ఉన్నాయి.
ప్రతి చీమల పుట్టలలో వేలాది సాహస కార్మిక చీమలు ఉంటాయి. అవి నిరంతరం ఆహార అన్వేషణలో నిమగ్నమై ఉంటాయి. మీ ఇంట్లో దానికి సరిపడా ఆహారం ఉందని అందులో ఒక్క చీమ గుర్తించినా మెరుపు వేగంతో ఆ సందేశం తన సమూహంలోని మిగతా చీమలకు అందజేస్తుంది. చీమల్లో ఉన్న సమాచార వ్యవస్థ అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొనవచ్చు. ఈ సమాచారం అందుకున్న చీమలు వెంటనే మన ఇళ్లలోకి చొరబడతాయి. అలాగే చీమలు నీటిని వెతుక్కుంటూ కూడా మన ఇళ్లలోకి వస్తాయి. ముఖ్యంగా బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఇవి నీటి కోసం అన్వేషణ సాగిస్తుంటాయి. అలాగే చీమలు ఎక్కువగా తేమతో నిండిన వాతావరణం ఉన్న ప్రదేశాలను తమ ఆవాసంగా మార్చుకుంటాయి.
వీటిని పూర్తిగా మన ఇండ్లలోకి రాకుండా చేయలేకపోయినా, వీటి రాకను మాత్రం కొంతవరకు నియంత్రించ వచ్చు. వాటికి ఆహారంగా పనికివచ్చే పదార్థాలన్నీ ఎయిర్ టైట్ కంటైనర్లలో ఉంచాలి. అలాగే ఫ్రిడ్జ్ వెనుక టోస్టర్ లోపల/కింద శుభ్రపరచాలి. అన్ని డబ్బాలు, సీసాలను సురక్షితంగా మూసివేసి ఉంచాలి. చీమలు మనకు హాని కలిగించే జీవులు కావని, కేవలం ఆహారం కోసమే మన ఇంటికి వస్తున్నాయని తెలుసుకోవాలి. మన ఇంటి పరిసరాల్లోని చెత్తను అవి శుభ్రం చేస్తూ పర్యావరణ హితులుగా పని చేస్తున్నాయని గుర్తుంచుకోవాలి.