రామగిరి, ఫిబ్రవరి 20 : జిల్లాలో ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియేట్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని నల్లగొండ డీఐఈఓ దస్రూనాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం నల్లగొండలోని ప్రభుత్వ లెక్చరర్స్ భవనంలో జిల్లాలోని పరీక్షల కేంద్రాల సీఎస్, డీఓలతో పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 45 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 28,905 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అయితే ప్రథమ సంవత్సరం రెగ్యూలర్ విభాగంలో 11,807 మంది, ఓకేషనల్ విభాగంలో 2,117 మంది, ద్వితీయ సంవత్సరం రెగ్యూలర్ విభాగంలో 11,733 మంది, ఓకేషన్ విభాగంలో 2,248 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 21, 22న పరీక్ష కేంద్రాలకు అవసరమైన మెటిరియల్స్ పంపిణీ జరుగుతుందన్నారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణలో హైపర్ కమిటీ, డీఈసీతో పాటు ఉన్నతాధికారుల ఆకస్మీక తనిఖీ ఉంటుందన్నారు. పరీక్షలపై సందేహాలకు హెల్ప్ లైన్ నెంబర్ 28483 09004 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహంచాలన్నారు. పరీక్షలకు విద్యార్థులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో వచ్చినా అనుమతించాలని, దానిపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని పేర్కొన్నారు.