Climate Change | భవిష్యత్‌లో వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదం ముంగిట ఉన్నాయంటూ పరిశోధకులు హెచ్చరించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలే కారణమని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కార్బన ఉద్గారాల రేటు ప్రస్తుతం ఉన్నట్లుగా కొనసాగితే.. 2100 నాటికి సముద్ర మట్టాలు 0.5 నుంచి 1.9 మీటర్లు పెరగవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. ఇది ఐక్యరాజ్య సమితి ప్రస్తుత అంచనా (0.6 నుంచి మీటరు) కంటే 90 సెంటీమీటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. సముద్ర మట్టం పెరుగుదల అంటే.. భూమి మధ్య నుంచి కొలిచిన సముద్ర ఉపరితల సగటు ఎత్తు పెరుగుదల. ఈ దృగ్విషయానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. హిమనీనదాలు, మంచుపలకలు కరగడంతో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు విస్తరించడం. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగత్రలు పెరుగుతున్నాయి. ఫలితంగా గ్రీన్లాండ్, అంటార్కిటికాలోని మంచు పలకలు వేగంగా కరుగుతున్నాయి. దాంతో సముద్ర మట్టం గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. అలాగే, సముద్రం నీరు సైతం వేడెక్కడంతో పాటు విస్తరిస్తున్నది. ఫలితంగా సముద్ర మట్టాలు మరింత పెరగనున్నాయి. ఈ పెరుగుదల వాతావరణ మార్పులను సూచిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతాల్లోని ప్రజలు, పర్యావరణ వ్యవస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతుంది.
సముద్రమట్టాలు పెరగడం వల్ల భారత్, చైనా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లకు ప్రమాదకరమని 2023లో ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆయా దేశాల్లో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 900 మిలియన్ల మంది ప్రమాదంలో ఉన్నట్లుగా పేర్కొంది. భూ చరిత్రలో సముద్ర మట్టంలో అనేకసార్లు హెచ్చుతగ్గులు కనిపించాయి. కానీ, ప్రస్తుతం సముద్ర మట్టం పెరిగే రేటు ఇప్పుడు అపూర్వంగా ఉందని.. దాన్ని విస్మరించడం సముచితం కాదని పరిశోధకులు పేర్కొంటున్నారు. 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టం దాదాపు 15-20 సెంటీమీటర్లు పెరిగింది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం, గ్రీన్ హౌస్ వాయుల ఉద్గారాల పెరగడం తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరుగుతున్నది. ఈ సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా రోడ్లు, వంతెనలు, భవనాలు సహా మౌలిక సదుపాయాలకు ముప్పు వాటిల్లుతుంది. తీర ప్రాంతాలు వరదలతో కోతలకు గురవడంతో పాటు మంచినీటి వనరులను ఉప్పునీరు ఆక్రమిస్తుంది. దాంతో తాగునీరు కరువు పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి.
గత నాలుగు దశాబ్దాలలో సముద్రం వేడెక్కే రేటు నాలుగు రెట్లు పెరిగిందని కొత్త అధ్యయనం వెల్లడించింది. జర్నల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 1980లలో సముద్ర ఉష్ణోగ్రత దశాబ్దానికి 0.06 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుండగా.. ప్రస్తుతం అది దశాబ్దానికి 0.27 డిగ్రీల సెల్సియన్కు పెరిగింది. 2023-24 ప్రారంభంలో ప్రపంచ సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. యూకేలోని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన క్రిస్ మర్చంట్ మాట్లాడుతూ సముద్రాలు వేడకెక్కకుండా చూసేందుకు ప్రపంచమంతా కార్బన ఉద్గారాలను తగ్గించడమే ఏకైక మార్గమన్నారు.
Govt Junior Colleges | రండి బాబూ రండీ.. సర్కారు కాలేజీల్లో చేరండి.. ఇంటర్ బోర్డు సరికొత్త ప్రచారం
Electricity Meters | కాలిపోతున్నాయ్.. గ్రేటర్లో ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ల పనితీరు!