Electricity Meters | దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్లో విద్యుత్ మీటర్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత సంవత్సరం మీటర్లలో సాంకేతిక లోపాలు, అధిక లోడ్ కారణంగా 1.63 లక్షల వరకు మీటర్లు స్టకప్అవ్వడం లేదా కాలిపోవడం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. తరచూ మీటర్లలో సాంకేతిక సమస్యలు రావడం, సిబ్బంది కూడా మినీమం బిల్లు అంటూ అధిక బిల్లులు వసూలు చేయడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడుతున్నది.
– సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ)
60 లక్షలకు పైగా కనెక్షన్లు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో 60లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 53 లక్షల వరకు గృహ వినియోగదారులు, 6 లక్షల వరకు కమర్షియల్ సర్వీసులు, 50వేలకు పైగా పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గత సంవత్సరం సగటున నెలకు 20వేల కరెంటు మీటర్లు రిపేర్‌కు రావడం, కాలిపోవడం జరిగినట్లు ఇటీవల ఒక నివేదికలో విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఏప్రిల్, మే, జూలైల్లో స్టకప్ అవ్వడంతో పాటు కాలిపోయాయని, వీటికి అధిక లోడ్ కారణంగా నివేదికలో పేర్కొన్నారు. మీటర్లు రిపేర్లకు రావడంతో వాటిని రిప్లేస్ చేయకపోగా, మినీమం బిల్లు వేయడంతో వినియోగదారులపై తీవ్ర భారం పడుతున్నది.
ఒక్క గ్రేటర్‌లోనే..
ఒక్క గ్రేటర్‌లోనే 1లక్ష, 11వేల మీటర్లు రిపేర్లకు రావడం లేదా కాలిపోవడం జరిగిందని అధికారులు చెబుతుండగా.. 1.63 లక్షల మీటర్లు రిపేర్‌కు వచ్చినట్లు విద్యుత్ అధికారుల అంతర్గత నివేదిక చెబుతున్నదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సైబర్‌సిటీ, బంజారాహిల్స్ సర్కిళ్లలో 8వేల మీటర్లు కాలిపోగా, 25వేల మీటర్లు రిపేర్లకు వచ్చాయి. అయితే మీటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడానికి కారణాలేవైనా ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే డిస్కం రిప్లేస్ చేయాలి. మీటర్ కాలిపోతే మాత్రం వినియోగదారుడు రూ.2వేలు చెల్లించాలి. ఒకవైపు నెలకు 20వేల మీటర్లు రిపేర్లకు వస్తే.. అందులో రెండు నుంచి మూడు వేల మీటర్లు కాలిపోతున్నాయి. దీనివల్ల ఒకవైపు డిస్కంతో పాటు మరోవైపు వినియోగదారులపై కూడా ఆర్థిక భారం పడుతున్నది. మీటర్లలో నాణ్యత లోపించడం కారణంగానే ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు.
అధికలోడే ప్రధాన కారణం..
మీటర్లలో సాంకేతికలోపాలు రావడానికి, కాలిపోవడానికి అధిక లోడే ప్రధాన కారణంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సిబ్బంది చెబుతున్నారు. తక్కువ లోడ్ సామర్థ్యంతో మీటర్ తీసుకుని ఎక్కువ విద్యుత్ వినియోగించడం వల్ల ఈ సమస్య తలెత్తుతున్నది. అంతేకాకుండా లూజ్ కాంటాక్ట్, షార్ట్ సర్క్యూట్, వర్షానికి తడిసిపోవడం వంటి కారణాలను కూడా డిస్కం చూపుతున్నది. కానీ మీటర్లలో నాణ్యత లేకపోవడం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే విద్యుత్ కనెక్షన్లు తీసుకునే సమయంలో ఆయా ప్రాంతాల్లో లోడ్‌ను పరిశీలించి, ఆ తరవాత మీటర్ రీడింగ్ ఆధారంగా ఎంతమేరకు లోడ్ పడుతుందో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రమైంది. అంతేకాకుండా నాణ్యతలేని సర్వీస్ వైర్లు మార్చకుండా వాడటంతో పాటు సామగ్రి కూడా చవకబారుదే వాడటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు.
మీటర్లలో సాంకేతిక లోపాలు తగ్గాయి :సీఎండీ ముషారఫ్ ఫరూఖి
గతంతో పోలిస్తే విద్యుత్ మీటర్లలో తలెత్తే సాంకేతిక లోపాలు తగ్గుముఖం పట్టాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలోని 15 జిల్లాల్లో 93,46,952 బిల్ట్ సర్వీసులు ఉన్నాయని, గత సంవత్సరం కాలిపోయిన మీటర్ల సంఖ్య 1.21 శాతానికి తగ్గాయని, వచ్చే ఈ ఆర్థిక సంవత్సరంలో లోపాలను పూర్తిగా అధిగమించి మరింత మెరుగైన సరఫరా అందజేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు సైతం తమ గృహాల్లో, వాణిజ్యసముదాయాల్లో కనెక్టెడ్ లోడ్‌కు తగ్గట్టు ఇంటర్నల్ వైరింగ్, ఎర్తింగ్, జాయింట్లు లేని వైర్లు, ఎంసీబీలు ఏర్పాటు వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
22న ఒక్కరోజే..
ఇటీవల ఇండ్లలో, వాణిజ్య సంస్థల్లో విద్యుత్ ఉపకరణాల వినియోగం పెరిగిందని, దీంతో లోడ్ ఎక్కువవుతున్నదని తెలుస్తున్నది. ఈనెల 22న ఒక్కరోజే గ్రేటర్లో 4800 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ నమోద్వడంతో అధికారులు రాబోయే వేసవిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తాము రీడింగ్ తీసే సమయంలో కానీ, మీటర్లు కాలినప్పుడు వెళ్లినప్పడు కానీ వినియోగదారుల నుంచి వచ్చే స్పందన వ్యతిరేకంగా ఉంటుందని, తాము ప్రశ్నిస్తే తమపై గొడవలకు దిగుతున్నారని, మీటర్లు కాలిపోయిన తర్వాత రిప్లేస్ కోసం తిరిగినప్పుడు కూడా లోడ్ విషయంలో చెబితే వినిపించుకోవడం లేదని వారు చెబుతున్నారు. వినియోగానికి తగినట్లు లోడ్ సామర్థ్యం ఉన్న మీటర్లు తీసుకుంటే అటు డిస్కంకు ఇటు వినియోగదారులకు ఉపయోగమని వారు పేర్కొన్నారు.