Govt Junior Colleges | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ క్యాంపెయిన్‌ను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లను నియమించారు. ముగ్గురికి కొన్ని కాలేజీలు అప్పగించి ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రయత్నించాలని ఆదేశాలిచ్చారు. సర్కారు కాలేజీల్లోనే చేరండి.. ప్రయోజనాలు ఇవిగో అంటూ వారు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 428 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా వీటిల్లో 3లక్షలకు పైగా సీట్లున్నాయి. అయితే ఈ విద్యాసంవత్సరం ఫస్టియర్‌లో 83వేల మంది మాత్రమే చేరారు. గతంలో లక్ష మందికి పైగా విద్యార్థులు చేరిన దాఖలాలున్నాయి. ఏటా ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్ల పెంపుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మరో 50వేల అడ్మిషన్లు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడున్న అడ్మిషన్లకు అదనంగా 60శాతం అడ్మిషన్లు పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.
సర్కారు కాలేజీల్లో ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. కొన్ని కాలేజీల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కన్నా తక్కువగా ఉన్నది. దీంతో ఈ కాలేజీలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. 20శాతం లోపు ఉత్తీర్ణత నమోదైన కాలేజీలను రెడ్‌జోన్, 40శాతంలోపు ఉత్తీర్ణత నమోదైన కాలేజీలను ఎల్లోజోన్, 40శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత నమోదైన కాలేజీలను గ్రీన్‌జోన్‌గా విభజించారు. కాలేజీల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మూడేండ్లల్లో సబ్జెక్టువారీగా, గ్రూపు, కాలేజీవారీగా ఫలితాలు అధ్యయనం చేస్తున్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణతను బట్టి నష్టనివారణ చర్యలు చేపట్టనున్నారు.
ఇంటర్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ వసతి సమస్యగా మారుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలేజీ వసతి గృహాల్లో సీట్లు పరిమితంగా ఉండటం, హాస్టళ్లో సీటు రాకపోవడంతో విద్యార్థులు సర్కారు జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడటంలేదు. దీంతో ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య కలెక్టర్లతో మాట్లాడి కాలేజీ వసతిగృహాల్లో సీట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్కారు కాలేజీల్లోని విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.