Sperm Donor | ఓ వీర్య దాత (Sperm Donor) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 మంది చిన్నారులు (Childrens) ప్రమాదంలో పడ్డారు. క్యాన్సర్‌కు (Cancer Risk) కారణమయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన ఐరోపా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. డెన్మార్క్ (Denmark)కు చెందిన ప్రభుత్వ ప్రసార సంస్థ డీఆర్ ఈ ఆరోగ్య సంక్షోభాన్ని వెలుగులోకి తెచ్చింది.
డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి 2005లో వీర్యదానం చేశాడు. ఈ వీర్యాన్ని డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ 2006 నుంచి 2022 వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 దేశాల్లోని 67 క్లినిక్‌లకు సరఫరా చేసింది. ఈ వీర్యం ద్వారా 197 మంది పిల్లలు జన్మించారు. ఒక్క డెన్మార్క్‌లో 99 జననాలు నమోదయ్యాయి. అయితే, అతడి వీర్యంలో TP53 అనే జన్యువులో లోపం ఉంది. అప్పట్లో సాధారణ స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ జన్యు లోపాన్ని గుర్తించలేకపోయారు. ఈ లోపం వల్ల పుట్టే పిల్లలకు ‘లీ-ఫ్రామినీ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వస్తుంది. దీనివల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 90 శాతం వరకు ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, ఎముకల క్యాన్సర్ వంటివి వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి.
2025లో వైద్యనిపుణులు ఈ అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో అసలు విషయం బయటపడింది. సాధారణంగా యూకేలో ఒక దాత వీర్యాన్ని గరిష్ఠంగా 10 కుటుంబాలకు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉండగా, ఇతర దేశాల్లో అలాంటి కఠిన నియమాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఐరోపా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ జన్యుపరమైన లోపంతో ఉన్న చిన్నారులపై డాక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టి, క్యాన్సర్ ని తొలిదశలోనే రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read..
India In UN | అఫ్ఘాన్‌పై పాక్ దాడులు యుద్ధ చర్యలే : భారత్
Maria Corina Machado | అజ్ఞాతం వీడి.. నార్వేలో ప్రత్యక్షమైన నోబెల్ శాంతి గ్రహీత మచాడో.. VIDEO