Angelina Jolie : హాలీవుడ్ (Hollywood) కు చెందిన ప్రముఖ నటి, గ్లోబల్ ఐకాన్ ఏంజెలినా జోలీ (Angelina Jolie) కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రాడ్ పిట్తో విడాకుల ప్రక్రియ, న్యాయపరమైన పోరాటాలు ముగియడంతో ఇక అమెరికాను వీడి విదేశాల్లో స్థిరపడాలని ఆమె యోచిస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ కేవలం పిల్లల కోసమే లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో ఉండాల్సి వచ్చిందని, ఇకపై అక్కడ కొనసాగే ఉద్దేశం లేదని ఆమె తన సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు తెలిసింది.
బ్రాడ్ పిట్తో పిల్లల కస్టడీ ఒప్పందం కారణంగా తాను లాస్ ఏంజిల్స్‌లో నివసించాల్సి వచ్చిందని, లేదంటే అక్కడ ఉండాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని జోలీ గతంలో కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో తాను చూసిన మానవత్వం, ప్రశాంతత లాస్ ఏంజిల్స్‌లో కనిపించలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విడాకుల కారణంగానే తాను అక్కడ చిక్కుకుపోయానని ఆమె వ్యాఖ్యానించారు.
జోలీ, పిట్ దంపతులకు ఆరుగురు సంతానం. వారి విడాకులు గత ఏడాది డిసెంబర్లో అధికారికంగా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో తన పిల్లలైన కవలలు నాక్స్, వివియన్‌లకు 18 ఏళ్లు నిండిన వెంటనే విదేశాలకు మకాం మార్చాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2017లో ఆమె 24.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన చారిత్రాత్మక సిసిల్ బి డిమిల్లీ ఎస్టేట్‌ను కూడా అమ్మకానికి పెట్టనున్నట్లు సమాచారం.
అదేవిధంగా విదేశాల్లో ఎక్కడ స్థిరపడాలనే దానిపై ఏంజెలినా పలు దేశాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు మాడాక్స్ (దత్త కుమారుడు) సొంత దేశం కాంబోడియా అంటే ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అక్కడ ఎక్కువ సమయం గడపాలని ఆమె కోరుకుంటున్నారు. బహుశా కాంబోడియాలో స్థిరపడాలనే ఆలోచనలో కూడా ఆమె ఉండి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
కాగా ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమా సెట్లో ప్రేమలో పడిన ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ జంట 2014లో వివాహం చేసుకున్నారు. రెండేళ్లకే 2016లో విడిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీ, ఆస్తుల పంపకాలపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఇదిలావుండగా వృత్తిపరంగా జోలీ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ‘ది ఇనిషియేటివ్’ అనే స్పై థ్రిల్లర్‌లో ఆమె నటించనున్నారు.