S Jaishankar | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్ (India) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు (50 శాతం) విధించిన (Trump Tariffs) విషయం తెలిసిందే. భారత్-అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను (Russian Companies) ఆహ్వానించారు.
మాస్కోలో బుధవారం జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు. ‘ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి’ అన్నదే ఇరు దేశాల వాణిజ్యమంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
గత నాలుగేళ్లలో భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని జైశంకర్ స్పష్టం చేశారు. కానీ ఆ పెరుగుదలతో పాటు భారీ అసమతుల్యత కూడా ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ‘2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల వాణిజ్యం 2024–25లో 68 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, 2021లో 6.6 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే తొమ్మిది రెట్లు పెరిగింది. దీనిని తక్షణమే పరిష్కరించుకోవాలి’ అని జైశంకర్ అభిప్రాయపడ్డారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని ఆయన గుర్తుచేశారు. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందన్నారు. భారత్లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు.
Also Read..
Oil Trade | రష్యా స్పెషల్ డిస్కౌంట్.. ముడి చమురు కొనుగోళ్లను పెంచిన ప్రభుత్వ సంస్థలు..!