Oil Trade | పెరిగిన డిస్కౌంట్స్ నేపథ్యంలో భారత ప్రభుత్వ సంస్థలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సెప్టెంబర్, అక్టోబర్ డెలివరీ కోసం కొనుగోళ్లను చేపట్టాయి. కొంతకాలంగా రష్యన్ చమురుపై తగ్గింపు గణనీయంగా తగ్గింది. దాంతో కొనుగోలును నిలిపివేశాయి. ప్రభుత్వ చమురు శుద్ధి కర్మారాగాలను మళ్లీ రష్యన్ చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించడంతో చైనాకు సరఫరా తగ్గే అవకాశాలున్నాయి. దేశీయ కంపెనీలు కొనుగోలు ఆపేసిన సందర్భంలో చైనా తన కొనుగోళ్లను పెంచింది.
తక్కువ తగ్గింపులు, అమెరికా నుంచి ఆంక్షల నేపథ్యంలో దేశీయ రిఫైనరీలు జులైలో రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేయడం తగ్గించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి బదులుగా ఆగస్టు 27 నుంచి భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తామని బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. యూరల్స్ ముడి చమురుపై తగ్గింపు బ్యారెల్‌కు మూడు డాలర్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. ఇది చమురు రిఫైనరీలను ఆకర్షించింది. యూరల్స్ కాకుండా ఇండియన్ ఆయిల్ వరండే, సైబీరియన్ లైట్‌తో సహా ఇతర రష్యన్ ముడి చమురు గ్రేడ్లను సైతం కొనుగోలు చేసింది.
భారత్ మొత్తం దిగుమతుల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల (OPEC) దేశాల వాటా జూలైలో ఐదు నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. జనవరి-జూలైలో రష్యా చమురు దిగుమతులు 3.6శాతం తగ్గి రోజుకు 17.3 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. జూలైలో 2011 తర్వాత భారతదేశం మొదటిసారిగా లాటిన్ అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకోలేదు. భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా కొనసాగింది. ఆ తర్వాత ఇరాక్, సౌదీ అరేబియా ఉన్నాయి. జూన్‌తో పోలిస్తే జూలైలో రిలయన్స్ కొనుగోళ్లను దాదాపు 19 శాతం తగ్గించడంతో భారత్.. రష్యన్ చమురు దిగుమతులు కూడా పాక్షికంగా తగ్గాయి. ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీలు ఆగస్టు, సెప్టెంబర్లలో రష్యన్ చమురు స్థానంలో మధ్యప్రాచ్యం, యూఎస్ నుంచి ప్రత్యామ్నాయంగా సరఫరా చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉంటామని ఇండియన్ ఆయిల్ తెలిపింది. చైనా శుద్ధి కర్మాగారాలు అక్టోబర్, నవంబర్ డెలివరీ కోసం 15 కార్గో రష్యన్ చమురును కొనుగోలు చేశాయి.
డిస్కౌంట్లలో తగ్గుదల కారణంగా జూలైలో చమురు కొనుగోళ్లు తగ్గాయి. డేటా ప్రకారం.. జూలైలో భారతదేశ రష్యన్ చమురు దిగుమతులు తగ్గాయి. ఎందుకంటే కొన్ని రైఫనరీలు తక్కువ డిస్కౌంట్ల కారణంగా కొనుగోళ్లను తగ్గించాయి. అంతే కాకుండా వర్షాలలో భారత్‌లో ఇంధన డిమాండ్ కూడా సాధారణంగా తగ్గుతుంది. అయితే, ఆగస్టులో రష్యా చమురు దిగుమతులు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ రిఫైనరీలు తక్కువ డిస్కౌంట్ల కారణంగా యూరల్స్ ముడి చమురు కొనుగోలును నిలిపివేసాయి. జూలైలో భారతదేశం రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. జూన్‌తో పోలిస్తే ఇది 24.5 శాతం తగ్గింది. జూలైలో భారత్ మొత్తం దిగుమతులకు (రోజుకు 4.44 మిలియన్ బ్యారెళ్లు) రష్యా వాటా 34 శాతం. ఈ కాలంలో భారతదేశ చమురు దిగుమతులు సెప్టెంబర్ 2023 తర్వాత అత్యల్పంగా నమోదయ్యాయి.