Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఫౌజీ షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు స్పిరిట్, కల్కి 2 సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. అద్దం ముందు నిలబడి సిగార్ వెలిగిస్తున్న స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఆ ఫోటో ‘స్పిరిట్’ సినిమాలోని లీక్ స్టిల్ అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడిందా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కొందరు ఫ్యాన్స్ ఇది ఒరిజినల్ స్టిల్ అని నమ్ముతుంటే, మరికొందరు మాత్రం ఇది ఫ్యాన్ మేడ్ లేదా ఏఐ ఇమేజ్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. చిత్రబృందం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ‘స్పిరిట్’ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, ప్రముఖ నటులు వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు.
ప్రభాస్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. లీక్ స్టిల్ అంటూ వైరల్ అవుతున్న ఫోటో నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఆ లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా నుంచి అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.