ముంబై: భారత్, ఫ్రాన్స్ మధ్య సైనిక సంబంధాలు మరిత బలపడ్డాయి. అయితే ఫ్రాన్స్ సహకారంతో ఇండియా స్వదేశీయంగా హామర్ క్షిపణు(Hammer Missiles)లను ఉత్పత్తి చేయనున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, ప్రధాని మోదీ మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో హామర్ మిస్సైల్‌ను ఇండియా వాడింది. హామర్‌ను.. హైలీ ఎజైల్ మోడ్యులార్ మునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిగా పిలుస్తున్నారు. ప్రస్తుత భారత వైమానిక దళం వద్ద ఉన్న రఫేల్ యుద్ధ విమానాలకు ఈ క్షిపణులను జోడించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ సంయుక్తంగా ఈ క్షిపణులను డెవలప్ చేయనున్నాయి.
తాజాగా 114 రఫేల్స్ కొనుగోలు కోసం రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధ విమానాల కోసం కూడా అదనంగా హామర్ క్షిపణులను తయారు చేయాల్సి ఉంటుంది. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలకు కూడా హామర్ క్షిపణులను ఫిక్స్ చేయనున్నారు. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హెచ్125 హెలికాప్టర్లను కూడా ఉత్పత్తి చేయనున్నారు. హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్‌ను కర్నాటకలోని వేమగాల్లో ప్రారంభించారు. యురోపియన్ సంస్థ ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా హెచ్125 హెలికాప్టర్లను అభివృద్ధి చేయనున్నాయి.
లైట్ మల్టీరోల్ పాత్రను హెచ్125 హెలికాప్టర్ పోషించనున్నది. హిమాలయాల్లోని మంచు పర్వతాలపై ఇది కీలకం కానున్నది. అయితే మిలిటరీ వర్షన్‌కు చెందిన హెచ్125ఎం మోడల్‌ను స్వదేశీయంగా ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రికార్డులు ప్రకారం ఎవరెస్టు శిఖరంపై సుమారు 29 వేల ఫీట్ల ఎత్తుకు ఈ హెలికాప్టర్ చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2027 నాటికి తొలి మేడిన్ ఇండియా హెచ్125 హెలికాప్టర్ సిద్ధంకానున్నది. ఎయిర్‌బస్-టాటా కంపెనీలు గతంలో సీ295 మిలిటరీ విమానం తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.