న్యూఢిల్లీ, నవంబర్ 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గింది. రష్యా (Russia) నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు 50 శాతం ప్రతీకారం సుంకాలు విధించిన అమెరికా నుంచి 2026లో ఏడాదిపాటు వంటగ్యాస్ (LPG) దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా నుంచి ఇంధన కొనుగోళ్లను విస్తరించుకోవాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయానికి ఊతమిస్తూ ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తమ రెండు దేశాల మధ్య వాణిజ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఎక్కువగా దిగుమతులు తక్కువగా ఉండడంతో దీన్ని సరిచేసే ప్రయత్నంలో భాగంగా భారత్లోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి సుమారు 22లక్షల టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ఏడాది ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఓ అధికారిక ప్రకటన సోమవారం తెలిపింది. ఏటా భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో ఈ ఒప్పందం 10 శాతం ఉంటుంది. భారత్ ఏటా దిగుమతి చేసుకునే ఎల్పీజీలో 90 శాతం యూఏఈ నుంచి వస్తుంది.