మంథని, నవంబర్ 17: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సాక్షిగా పెద్దపల్లి జిల్లా మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో సమస్యలు వెల్లువెత్తాయి. సోమవారం ఆయన మంథనిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించగా, పలు సమస్యలు బహిర్గతం అయ్యాయి. పలు క్లాస్ రూముల్లో విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడగా.. ఇక్కడ నెలకొన్న పలు సమస్యల గురించి చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తరగతి గదుల్లోని స్లాబ్ పెచ్చులూడి పోతున్నాయని, ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని నిత్యం భయాందోళన చెందుతున్నామని వాపోయారు. వర్షం నీళ్లు స్లాబ్ నుంచి వస్తున్నాయన్నాయని వివరించారు.
స్పందించిన చైర్మన్ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’ పాఠశాలలో కలియ తిరగగా పలు సమస్యలు దర్శనమిచ్చాయి. పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లను ట్యాప్లు సక్రమంగా లేవనే కారణంగా వినియోగించకుండా క్లోజ్ చేయడంతో డార్మెంటరీ దగ్గర ఉన్న మరుగుదొడ్లను విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన మరుగుదొడ్ల పనులు పూర్తి చేయకపోవడంతో విద్యార్థుల మరుగదొడ్లనే వినియోగిస్తుండటంతో అవి సరిపోక ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడించారు.