హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ): వైసీపీ అధినేత జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణకు హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తి పత్రాలను సంబంధిత బ్యాంకు హామీ తీసుకుని విడుదల చేయాలని హైకోర్టు సోమవారం సీబీఐ కోర్టును ఆదేశించింది. జగతి, జనని, ఇందిరా టెలివిజన్ల కరెంటు ఖాతాల నిర్వహణకు రూ.4.95 కోట్లకుగాను బెంగళూరు సమీపంలో నల్లూరులో రేవన్ ఇన్ఫ్రాకు చెందిన రూ.6.30 కోట్ల విలువైన 9 ఎకరాల స్థిరాస్తి పత్రాలను హామీగా పెట్టారు. జగన్ కేసుల నేపథ్యంలో సీబీఐకోర్టు ఆయా ఖాతాలను 2012లో స్థంభింపజేసింది. హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తులను విడుదల చేయాలని జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. రేవన్ ఇన్ఫ్రా స్థిరాస్తి పత్రాలు విడుదల చేయాలని ఆదేశించారు.
జిల్లాకో వినియోగదారుల కమిషన్‌పై నిర్ణయం తీసుకోండి ; ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో కూడా వినియోగదారుల కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకొని, అమలు నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆకుల సంపత్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం ప్రతి జిల్లాకో కమిషన్ ఏర్పాటుచేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నివేదించారు. ప్రభుత్వం పక్షాన ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కొత్త జిల్లాల్లో కమిషన్ల ఏర్పాటుపై ప్రభుత్వం చర్చిస్తున్నదని తెలిపారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.