హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్ష (TET) విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లను (Government Teachers) కాంగ్రెస్ సర్కారు (Congress Govt) దారుణంగా మోసం చేసింది. ఉపాధ్యాయులకు ధోకా ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి వంచించింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పాస్ కావడం తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఆగస్టులో తీర్పు ఇచ్చింది. 2010 ఆగస్టు 23 తర్వాత నియమితులైన వారికి మాత్రమే టెట్‌లో పాస్‌కావడం తప్పనిసరి. కానీ తాజా తీర్పుతో 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన వారు.. ఉద్యోగంలో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలన్నా టెట్ ఉండాల్సిందే. అంటే టెట్ లేని వారంతా రెండేండ్లల్లో పాస్కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీచర్లను టెట్ టెన్షన్ పట్టిపీడిస్తున్నది. ఈ విషయంపై సర్కారు స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తామన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామన్నది. దీంతో టీచర్లంతా కాస్త ఉపశమనం పొందా రు. ప్రభుత్వమే స్పందించడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాయాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
టెట్ రాయాలంటూ జీవో
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత విషయంలో గతంలో జారీచేసిన జీవోను ప్రభుత్వం సవరించింది. జీవో-36ను సవరించి కొత్తగా జీవో-28ను జారీచేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాసుకోవచ్చని వెల్లడించింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా టెట్ రాసుకోవచ్చని స్పష్టంచేసింది. సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌ను కూడా రాసుకోవచ్చన్నది. ఇక డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలతో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా కొనసాగుతున్న వారు పేపర్-1 రా యాలి. స్కూల్‌అసిస్టెంట్లు, భాషాపండితులు, హైస్కూ ల్ హెచ్ఎంలు పేపర్-2 రాసుకోవాలి. ఒకవైపు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్.. మరోవైపు టెట్ రాయాలనే ద్వంద్వ విధానమేంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్ రాయాలంటూ ఇచ్చిన జీవోను సవరించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ముంచుకొస్తున్న గండం
సుప్రీంకోర్టు విధించిన రెండేండ్ల గడువు గండం ముంచుకొస్తున్నది. సుప్రీంతీర్పు వచ్చి ఇప్పటికే రెండున్నర నెలలు గడిచిపోయాయి. టెట్‌పై ఆగస్టు 31న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో టీచర్లంతా రెండేండ్లలోపు టెట్ పాస్‌కావాల్సిందే. కేవలం ఐదేండ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంది. ఈ ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్నవాళ్లు పదోన్నతి పొందాలంటే మళ్లీ టెట్ పాస్‌కావడం తప్పనిసరి. రెండేండ్లు అంటే ఉన్నదే 730 రోజులు. ఇప్పటికే 78 రోజులు గడిచిపోయాయి. రాష్ట్రంలో టెట్ పాస్‌కాకుండా కొనసాగుతున్న వారు 40వేలకు పైగా ఉన్నా రు. ఒక వైపు గడువు ముంచుకొస్తుండటం.. మరోవైపు కోర్టులో రివ్యూ పిటిషన్ పేరిట సమయం వృథా చేయడంపై టీచర్లు మండిపడుతున్నారు.
నేడు ఢిల్లీలో కీలక భేటీ
టెట్ నుంచి మినహాయించాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటేమో కేంద్రం చొరవతీసుకుని, విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) యాక్ట్‌ను సవరించాలి. ఈ యాక్ట్‌ను సవరించాలంటే పార్లమెంట్ ద్వారానే సాధ్యం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతేనే. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను విచారించి, టెట్ అవసరంలేదని తీర్పు ఇవ్వాలి. ఇక టెట్ అంశంపై మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనున్నది.
ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వండి: శ్రీపాల్‌రెడ్డి
టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌తో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) చైర్మన్ పంకజ్ అరోరాను వేర్వేరుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇదే విషయంపై మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. విద్యాహక్కు చట్టాన్ని సవరించడం లేదా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లపై కేంద్రం ఇంప్లీడ్ అయ్యే అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న బీఎడ్ అర్హత గల ఎస్జీటీలకు ఇన్‌సర్వీస్ షార్ట్‌టర్మ్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతి పొందేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.