న్యూఢిల్లీ, నవంబర్ 17: బీహార్ ఎన్నికల్లో (Bihar Elections) తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Pary) అధినాయకత్వానికి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళన కలగచేస్తోంది. అసలు కర్ణాటకలో (Karnataka) ఏం జరుగుతోంది? సిద్ధరామయ్య పదవిలో కొనసాగుతారా? ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న డీకే శివకుమార్ కల నెరవేరుతుందా? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాధానం లభించడం లేదు. కర్ణాటక అధికార మార్పిడికి సంబంధించిన నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని, దీని కోసం ఏ నాయకుడూ లాబీ చేయవలసిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో డీకే, ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులతో సమావేశం అవుతూ, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అపాయింట్మెంట్లు కోరుతుండడం గమనార్హం. కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, చెరకు రైతులు, రాష్ట్రంలో వరదల పరిస్థితి తదితర అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది.
పూర్తి స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగాలని సిద్ధరామయ్య ఆశిస్తుండగా బాగా పనిచేస్తున్న మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని డీకే చెబుతున్నారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ), కర్ణాటక ఇన్చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా జరిపిన సమీక్షల ఆధారంగా కొందరు మంత్రులను తప్పించాలని ఆయన వాదిస్తున్నారు. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు వరుస సమావేశాలు కర్ణాటకలో జరిగాయి. అయితే పార్టీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉన్నదీ, సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ఎందరేసి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదీ అంచనా వేసేందుకు ఈ సమీక్షలు జరిగినట్లు ప్రచారం ఉండగా వివిధ మంత్రుల పనితీరుపై కూడా సమీక్షలు జరిగినట్లు తాజాగా తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో తన నాయకత్వం కొనసాగింపుపై సిద్ధరామయ్యలో భరోసా ఏర్పడినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తాను పూర్తి కాలం అధికారంలో కొనసాగుతానని ఆయనలో నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మాత్రం నాయకత్వ మార్పు సమస్యను అధిష్టానం తేల్చాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఐదేండ్లూ సీఎంగా తనను కొనసాగించాలని, ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకేను ప్రకటించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్టు సమాచారం.
నవంబర్ విప్లవం తప్పదా?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 21కి రెండున్నరేళ్లు పూర్తవుతున్నందున నవంబర్ విప్లవం అనివార్యమని డీకే మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరగడం అనివార్యమని, అయితే నాయకత్వ మార్పు మాత్రం ఇప్పుడు జరిగే అవకాశం లేదని పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఊహాగానాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతున్నాయి. నవంబర్ 20న డీకేకు సిద్ధరామయ్య నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని, దీనిపై పార్టీ అధిష్ఠానం వద్ద చర్చ జరిగిందని, పార్టీలోని అగ్రనాయకులు కొందరు ఈ చర్చలలో పాల్గొన్నారని పార్టీ వర్గాలలో అంతర్గతంగా గుసగుసలు వినపడుతున్నాయి. అయితే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని, నాయకత్వ మార్పు మాత్రం జరిగే అవకాశం లేదని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఆదివారం స్పష్టం చేశారు. డీకేకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని ఆయన వర్గం ఒక పక్క డిమాండు చేస్తున్న వేళ తాను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నానని పరమేశ్వర ప్రకటించడం పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. డీకే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలోనే వేచి ఉన్నారు. ఢిల్లీకి వచ్చిన బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ తన సోదరుడి కోసం లాబీయింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.