న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (NREGA) కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య కాలంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (MGNREGA) డాటాబేస్ నుంచి దాదాపు 27 లక్షల మంది కూలీల పేర్లను తొలగించింది. ఇదే కాలంలో కొత్తగా చేరిన కూలీల సంఖ్య కేవలం 10.5 లక్షల మంది. అనర్హులను తొలగించడం కోసం ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ప్రాసెస్ జరుగుతున్న సమయంలో ఈ తొలగింపులు ఊపందుకున్నాయి. సామాజిక కార్యకర్తలు, విద్యావంతుల కన్సార్షియం లిబ్ టెక్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ పథకం డాటాబేస్ వివరాలను లిబ్ టెక్ విశ్లేషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల డాటాను పరిశీలించినపుడు, 15.2 లక్షల మంది కూలీలను తొలగించారు. మొత్తం కూలీల సంఖ్య 98.8 లక్షలకు చేరింది. నవంబర్ మధ్యలో నికర చేర్పులు 66.5 లక్షలకు తగ్గిపోయింది. అంటే, కేవలం ఒక నెలలో 27 లక్షల మందిని తొలగించేశారు. ఈ లబ్ధిదారుల్లో 6 లక్షల మంది క్రియాశీలక కూలీలని తెలిసింది.
పంచాయతీలపైకి నెట్టేసిన అధికారులు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ-కేవైసీ కార్యక్రమానికి, తొలగింపులకు సంబంధం లేదన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ వెరిఫికేషన్ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దీనిని నిర్వహించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, అంతిమంగా పంచాయతీలది అని తెలిపారు. ఐదేళ్లకోసారి జాబ్ కార్డ్‌లను రెన్యువల్ చేయవలసి ఉంటుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు అపీలు చేసుకోవడానికి సమయం ఇస్తున్నట్లు తెలిపారు. తుది ఆమోదం గ్రామ సభ ద్వారానే జరుగుతుందన్నారు. లిబ్ టెక్ సీనియర్ రిసెర్చర్ చక్రధర్ బుద్ధ మాట్లాడుతూ, ప్రతిసారీ కొత్త కొత్త ఆధార్ లింక్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి, తనిఖీలు చేస్తున్నారని, దీని వల్ల నిజాయితీపరులైన కూలీలకు కొత్త సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో కూలీల పేర్లు డాటాబేస్ నుంచి మాయమవుతున్నాయన్నారు. దీనిని బట్టి కొత్త టెక్నాలజీలను విచక్షణారహితంగా అమలు చేయకూడదనే విషయం స్పష్టమవుతున్నదన్నారు.
పద్ధతిగా పథకం అంతం: ప్రతిపక్షం
ఎంజీఎన్ఆర్ఈజీఏ డాటాబేస్ నుంచి ఒక నెలలోనే 27 లక్షల మందిని తొలగించినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. గ్రామీణ ఉపాధి పథకాన్ని అంతమొందించడానికి పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నమని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏబీపీఎస్), నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్), ఈ-కేవైసీ వంటి టెక్నాలజీలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేసింది.