హైదరాబాద్, నవంబర్ 17 ( నమస్తే తెలంగాణ): సౌదీ ఘోర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మహమూద్ అలీ, పలువురు మైనారిటీ నాయకులతో మాట్లాడారు. వెంటనే సౌదీకి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. దగ్గరుండి బాధిత కుటుంబాలకు సాయం చేయాలని సూచించారు.
మరోవైపు సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చర్చించింది. మైనారిటీ అభివృద్ధి, సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపించనున్నట్టు తెలిపింది. మరణించిన వారి మృతదేహాలకు సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల నుంచి ఇద్దరి చొప్పున ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.