Israel | గాజా (Gaza) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన సూచనను ఇజ్రాయెల్ (Israel) బేఖాతరు చేసింది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాను హమాస్ (Hamas) అంగీకరించిన విషయం తెలిసిందే. హమాస్ ప్రకటన నేపథ్యంలో గాజాపై దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. ట్రంప్ సూచన చేసిన కాసేపటికే గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుపడ్డాయి. గాజా స్ట్రిప్ అంతటా ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాజా నగరంలోని ఓ ఇంటిపై జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా.. దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలో జరిగిన మరో దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది.గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ సూచించిన ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించిన హమాస్.. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకున్నది. మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని వెల్లడించింది. గాజా పరిపాలనను పాలస్తీనా టెన్నోక్రాట్స్కు అప్పగించేందుకు సిద్ధమని తెలిపింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై వెంటనే దాడులు ఆపాలని హెచ్చరించింది. గాజాలో శాంతి స్థాపనకు పూనుకున్న అరబ్, ఇస్లామిక్ దేశాలతోపాటు అంతర్జాతీయ భాగస్వాములు, డొనాల్డ్ ట్రంప్‌ను హమాస్ అభినందనలు తెలిపింది.
హమాస్ నిర్ణయాన్ని అభినందించిన ట్రంప్.. ఈ మేరకు ఇజ్రాయెల్‌కు కీలక సూచనలు జారీ చేశారు. శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు. గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని, అలాగైతేనే బంధీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని పేర్కొన్నారు. దాడులు అలాగే కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. పరిష్కరించాల్సిన అంశాలపై తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. ఇది కేవలం గాజా గురించి మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుతున్న శాంతి గురించి’ అంటూ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
ఇక, హమాస్ అంగీకారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రణాళికలోని తొలి దశ అమలుచేయడానికి తాము సిద్ధమవుతున్నామని వెల్లడించారు. ఈ ప్రకటన చేసినకాసేపటికే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం.
Also Read..
Hamas | ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధం: హమాస్
PM Modi | గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగు.. ట్రంప్‌ను అభినందించిన మోదీ
నా మాట వినకపోతే అంతా నరకమే.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక