వాషింగ్టన్, అక్టోబర్ 3: గత రెండేండ్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుపై విసిగివేసారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలోని హమాస్ సంస్థకు డెడ్‌లైన్ విధిస్తూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం లోగా అంగీకరించకపోతే ‘అంతా నరకమే’ చవిచూడాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ‘వాషింగ్టన్ డీసీ సమయం ఆదివారం సాయంత్రం ఆరు గంటల లోగా హమాస్‌తో ఒప్పందం జరిగిపోవాలి.
ప్రతి దేశం దానిపై సంతకం చేయాలి. ఈ ఆఖరి ఒప్పందం కుదరకపోతే ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా నరకం అంతా హమాస్‌పై విరుచుకుపడుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కాగా ఈ వారం ప్రారంభంలో యుద్ధ విరమణకు సంబంధించిన ఒక ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ట్రంప్ ఆవిష్కరించారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాము పరిశీలిస్తున్నామని హమాస్ మంగళవారం ప్రకటించింది.