గాజా: హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండేండ్లుగా జరుగుతున్న యుద్ధానికి (Hamas Israel War) త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కన్పిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను (Hostages) వదిలేందుకు హమాస్ (Hamas) సిద్ధమైంది. అయితే గాజాలో (Gaza) నెతన్యాహూ సేనలు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది.
గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ సూచించిన ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించిన హమాస్.. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకున్నది. మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని వెల్లడించింది. గాజా పరిపాలనను పాలస్తీనా టెన్నోక్రాట్స్కు అప్పగించేందుకు సిద్ధమని తెలిపింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై వెంటనే దాడులు ఆపాలని హెచ్చరించింది. గాజాలో శాంతి స్థాపనకు పూనుకున్న అరబ్, ఇస్లామిక్ దేశాలతోపాటు అంతర్జాతీయ భాగస్వాములు, డొనాల్డ్ ట్రంప్‌ను హమాస్ అభినందనలు తెలిపింది.
ఈ నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు. గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని, అలాగైతేనే బంధీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని పేర్కొన్నారు. దాడులు అలాగే కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. పరిష్కరించాల్సిన అంశాలపై తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. ఇది కేవలం గాజా గురించి మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుతున్న శాంతి గురించి’ అంటూ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
కాగా, గత రెండేండ్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుపై విసిగివేసారిన ట్రంప్ గాజాలోని హమాస్ సంస్థకు డెడ్‌లైన్ విధిస్తూ తీవ్ర హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. తాను ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం లోగా అంగీకరించకపోతే ‘అంతా నరకమే’ చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘వాషింగ్టన్ డీసీ సమయం ఆదివారం సాయంత్రం 6 గంటలలోగా హమాస్‌తో ఒప్పందం జరిగిపోవాలి. ప్రతి దేశం దానిపై సంతకం చేయాలి. ఈ ఆఖరి ఒప్పందం కుదరకపోతే ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా నరకం అంతా హమాస్‌పై విరుచుకుపడుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కాగా ఈ వారం ప్రారంభంలో యుద్ధ విరమణకు సంబంధించిన ఒక ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ట్రంప్ ఆవిష్కరించారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాము పరిశీలిస్తున్నామని హమాస్ ఇప్పటికే ప్రకటించింది.