న్యూఢిల్లీ: గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన హమాస్ (Hamas) .. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ (Israel) బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం ముగింపునకు ఇది కీలక ముందడుగని చెప్పారు. గాజాలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్న ట్రంప్ నాయకత్వాన్ని మోదీ అభినందించారు.
‘గాజాలో శాంతి ప్రయత్నాలకు నిర్ణయాత్మక పురోగతి సాధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నా. బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతి స్థాపనకు కీలక ముందడుగు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండేండ్లుగా జరుగుతున్న యుద్ధానికి (Hamas Israel War) త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కన్పిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను (Hostages) వదిలేందుకు హమాస్ (Hamas) సిద్ధమైంది. అయితే గాజాలో (Gaza) నెతన్యాహూ సేనలు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చవిచూడాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగివచ్చింది.
We welcome President Trump’s leadership as peace efforts in Gaza make decisive progress. Indications of the release of hostages mark a significant step forward.
India will continue to strongly support all efforts towards a durable and just peace.@realDonaldTrump @POTUS
— Narendra Modi (@narendramodi) October 4, 2025
గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ సూచించిన ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించిన హమాస్.. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకున్నది. మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని వెల్లడించింది. గాజా పరిపాలనను పాలస్తీనా టెన్నోక్రాట్స్కు అప్పగించేందుకు సిద్ధమని తెలిపింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై వెంటనే దాడులు ఆపాలని హెచ్చరించింది. గాజాలో శాంతి స్థాపనకు పూనుకున్న అరబ్, ఇస్లామిక్ దేశాలతోపాటు అంతర్జాతీయ భాగస్వాములు, డొనాల్డ్ ట్రంప్‌ను హమాస్ అభినందనలు తెలిపింది.
ఈ నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ట్రంప్ అన్నారు. గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని, అలాగైతేనే బంధీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని పేర్కొన్నారు. దాడులు అలాగే కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. పరిష్కరించాల్సిన అంశాలపై తాము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. ఇది కేవలం గాజా గురించి మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుతున్న శాంతి గురించి’ అంటూ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.