Congo | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో దారుణం చోటు చేసుకుంది. తిరుగుబాటుదారులు నరమేధం (Islamic State Backed Rebels) సృష్టించారు. నిద్రలో ఉన్న సివిలియన్లను లేపి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికిచంపారు. ఈ ఊచకోతలో 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) ఈ ఊచకోతకు పాల్పడినట్లు పేర్కొంది. సైన్యం చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్య తూర్పు కాంగోలోని బెనీ (Beni), లుబెరో (Lubero) ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ‘నిద్రపోతున్న నివాసితులను లేపి ఓ చోటకు చేర్చారు. వారందరినీ తాళ్లతో కట్టేసి వేట కొడవళ్లు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారు. ఈ ఊచకోతలో మెలియా (Melia) గ్రామంలోనే దాదాపు 30 మంది పౌరులు మరణించారు. బాధితుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. కొందరిని ఇళ్లలోనే గొంతుకోసి హతమార్చారు. అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు’ అని లుబెరోలోని బాపెరే సెక్టార్ అధిపతి మెకైర్ సివికునులా తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని స్థానిక మీడియా పేర్కొంది. కాగా, జులై చివరిలో తూర్పు కాంగోలోని ఓ క్యాథలిక్ చర్చిపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Rabies | నాలుగు నెలల క్రితం కుక్క కాటు.. రేబీస్‌తో చిన్నారి మృతి
ChatGPT Go | భారతీయుల కోసం ఓపెన్ఏఐ చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 399కే ‘చాట్‌జీపీటీ గో’