Rabies | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వీధి కుక్క దాడిలో (Stray Dog Bite) గాయపడిన నాలుగేండ్ల చిన్నారి తాజాగా రేబీస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దావణగెరెలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఖదీరాబాను అనే నాలుగేండ్ల చిన్నారి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం, శరీర భాగాలపై గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అయితే, చిన్నారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కుక్క కాటుతో రేబీస్ సోకి చిన్నారి బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.
కాగా, ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, సుప్రీం ఆదేశాలపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇక, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. అధికారుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, వారి నిష్క్రియాత్మకత కారణంగా సరిగ్గా జంతు నియంత్రణ చర్యలు కొనసాగలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి మున్సిపాల్టీలు, ఇతర సంస్థలకు జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించడానికి ధర్మాసనం తిరస్కరించింది.
అంతకు ముందు కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ‘కుక్క కాట్ల వల్ల పిల్లలు మరణిస్తున్నారు. స్టెరిలైజేషన్తో రేబిస్ కట్టడి కావడం లేదు. ప్రతి ఏటా 37 లక్షల మంది కుక్క కాట్లకు గురవుతున్నారు, అంటే సగటున ప్రతి రోజూ 10 వేల మంది బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఏడాది 20 వేల రేబిస్ మరణాలు సంభవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డాటా వెల్లడిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
ChatGPT Go | భారతీయుల కోసం ఓపెన్ఏఐ చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్.. రూ. 399కే ‘చాట్‌జీపీటీ గో’
Apple | యాపిల్ కళ్లు చెదిరే డీల్.. బెంగళూరు కార్యాలయానికి రూ.1,000 కోట్లు అద్దె..!