శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 29, 2020 , 07:26:45

ధరణీతలాన.. నూతన చరితమై

ధరణీతలాన.. నూతన చరితమై

 • నేడు మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ ప్రారంభం
 • ‘రిజిస్ట్రేషన్‌ గోస’కు చరమ గీతం 
 • అక్రమాలకు ఆస్కారం లేకుండా అంతా ఆన్‌లైన్‌
 • ఒక క్లిక్‌తో ఏ మూల ఉన్నా.. భూమి వివరాలు 
 • హర్షం వ్యక్తం చేస్తున్న క్రయవిక్రయదారులు
 • వారంలో ఫౌతి..
 • 10 నిమిషాల్లో పాస్‌బుక్‌ 
 • తొమ్మిది అంచెలలో ప్రక్రియ పూర్తి
 • ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో రోజుకు 16 రిజిస్ట్రేషన్లు
 • సులువుగా స్లాట్‌ బుకింగ్‌ 

రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ధరణి సేవలు మొదలైతే  తాసిల్దార్‌ కార్యాలయాల్లో  రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయొచ్చని అధికారులు చెప్తున్నారు.  

మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం.. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భూమి వివరాలు తెలుసుకునే అవకాశం.. రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ‘ధరణి’  నేటి నుంచి అందుబాటులోకి రానున్నది.  

నిన్న మొన్నటిదాకా...

రూపాయి రూపాయిగా దాచుకున్న డబ్బు లక్షలు పోసి ఇష్టంగా భూమి కొన్నా.. రిజిస్ట్రేషన్‌ అయ్యి పాస్‌ బుక్‌ చేతికి వచ్చే వరకు చుక్కలు కనిపించేవి. తాసిల్దార్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగాల్సి వచ్చేది. పని కావాలంటే డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గర్నుంచి అధికారుల వరకు ఎందరినో ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి.

ఇయ్యాల్టి నుంచి..

కొన్న భూమి మీ పేరు మీదికి ఎక్కాలంటే కేవలం పది నిమిషాల పని. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియంతా ఆన్‌లైనే. ఎక్కడా, ఎవ్వరికీ రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ధరణి పోర్టల్‌లో వివరాలు నింపి, నిబంధనల ప్రకారం స్టాంప్‌ డ్యూటీ, మ్యుటేషన్‌ చార్జీలు చెల్లిస్తే చాలు. పాస్‌బుక్‌ మీ           చేతిలోఉంటుంది. 

ఫౌతి కష్టాలకు చెల్లు

రెవెన్యూ వ్యవస్థలో ఫౌతి జరగాలంటే ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. ఏండ్లకేండ్లు గడిచిన ఘటనలు కోకొల్లలు. ఏదైనా కారణంతో పట్టాదారు మరణిస్తే ఆ భూమిని వారసుల పేరు మీద చేయడానికి నరకం చూపించేవాళ్లు. ధరణి పోర్టల్‌తో ఆ సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరమగీతం పాడారు. కేవలం వారం రోజుల్లో ఫౌతి అయ్యి.. పట్టాదారు పాస్‌బుక్‌ చేతికి వచ్చేలా నిర్ణయించారు.

ప్రతి రోజు 16 రిజిస్ట్రేషన్లు.. 

వ్యవసాయ భూముల క్రయ విక్రయదారులు ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసి.. స్టాంప్‌ డ్యూటీ, మ్యుటేషన్‌ చార్జీలను చెల్లిస్తే సరిపోతుంది. కేవలం 8 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే అమ్మిన, కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకాల ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రతి రోజు 16 రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. ఉదాహరణకు మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 15 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉంటే.. ఒక్కో కార్యాలయంలో 16 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ చొప్పున 240 రిజిస్ట్రేషన్లు కేవలం ఒక్క రోజులోనే జరుగుతాయి.  ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తొమ్మిది అంచెలలో పూర్తి కానున్నది.

 • ధరణి పోర్టల్‌లోని సిటిజన్‌ కాలమ్‌లో లాగిన్‌ అయి.. భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ‘రిజిస్ట్రేషన్‌' ఫార్మాట్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలి. అమ్మకం దారుడి పాసు పుస్తకం నంబర్‌ ఆధారంగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.
 • ఈ- చలాన్‌లో ప్రభుత్వం సూచించిన విధంగా స్టాంప్‌డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
 • రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ బుక్‌ అవుతుంది. ఆ వివరాలు మెసేజ్‌ రూపంలో వస్తాయి.
 • రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాక్షుల వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నమోదు చేసి.. బయోమెట్రిక్‌కు సిఫారసు చేస్తారు. 
 • భూమి కొనుగోలుదారులు, విక్రయదారులతో పాటు సాక్షుల ఫొటోలు, బయోమెట్రిక్‌ తీసుకుంటారు.
 • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను స్కాన్‌ చేసి..తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ లాగిన్‌లోకి పంపుతారు. 
 • తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తన లాగిన్‌లోకి వచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న పత్రాలపై డిజిటల్‌ సంతకం, మ్యుటేషన్‌ చేస్తారు.
 • తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో సదరు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ కోసం అంగీకరిస్తారు. 
 • తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పీపీబీ (పట్టాదారు పాస్‌ బుక్‌)/ ఈపీపీబీ (ఎలక్ట్రానిక్‌ పట్టాదారు పాస్‌ బుక్‌)లను, మ్యుటేషన్‌ పత్రాలను కొనుగోలుదారుడికి వెంటనే అందిస్తారు. క్రయ విక్రయదారులు ఇంట్లో కూర్చొనే ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా లేదా మీ సేవా కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 

వారం రోజుల్లోనే ఫౌతి విరాసత్‌

భూ యజమాని మృతి చెందిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులను కల్పించడాన్ని పౌతి విరాసత్‌ అంటారు. గతంలో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అధికారుల చుట్టూ తిరిగితే గానీ ఫైలు కదిలేది కాదు.. కానీ ధరణి పోర్టల్‌ ద్వారా పౌతి విరాసత్‌ కేవలం వారం రోజుల్లోనే పూర్తవుతుంది. దరఖాస్తు మొదలుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందే వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తవుతుంది.  అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండదు. 

 • మొబైల్‌ ద్వారా లేదా ఇంటర్‌నెట్‌ సెంటర్‌కు వెళ్లిగాని ధరణి పోర్టల్‌లో లాగిన్‌ అయి... సక్సేషన్‌ (ఫౌతి విరాసత్‌) కాలమ్‌లో పొందుపర్చిన నమూనా ప్రకారం పట్టాదారుడి వారసులకు సంబంధించిన పూర్తి  వివరాలను నమోదు చేయాలి. కుటుంబ సభ్యులందరి జాయింట్‌ అగ్రిమెంట్‌ను, పట్టాదారుడి మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
 • ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుమును ఆన్‌లైన్‌లో గానీ, బ్యాంకులో గానీ చెల్లించాలి. 
 • ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించిన తరువాత సిటిజన్‌ పోర్టల్‌లో పౌతి విరాసత్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవాలి. స్లాట్‌బుక్‌ చేసిన ఏడు రోజుల తరువాత ప్రక్రియ షురూ అవుతుంది.  
 • ఏడు రోజుల గడువు ముగిసిన అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన పట్టాదారు వారసులు, వారికి సంబంధించిన సాక్షుల ఫొటోలను, బయోమెట్రిక్‌ను కంప్యూటర్‌ ఆపరేటర్‌ స్వీకరిస్తారు. అనంతరం తహసీల్దార్‌ లాగిన్‌లోకి పంపుతారు.
 • లాగిన్‌లోకి వచ్చిన పౌతి విరాసత్‌ డాక్యుమెంట్లను, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్‌ పరిశీలిస్తారు. అలాగే బయోమెట్రిక్‌ వివరాలను పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటే ఫౌతి విరాసత్‌ కోసం తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అనుమతి ఇస్తారు. 
 • అనుమతి వచ్చిన వెంటనే మృతి చెందిన భూ యజమాని వారసులకు పట్టాదారు పాసు బుక్‌ (పీపీబీ), ఎలక్ట్రానిక్‌ పట్టాదారు పాసుబుక్‌ (ఈపీపీబీ)లను, డాక్యుమెంట్లను కంప్యూటర్‌ ఆపరేటర్‌ అందిస్తారు. ఫౌతి విరాసత్‌ దరఖాస్తు మొదలుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందే వరకు ప్రక్రియ అంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ప్రతి డాక్యుమెంట్‌ను నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కారణాలను పేర్కొంటూ.. తిరస్కరిస్తారు. 
తాజావార్తలు