జగదేవపూర్,అక్టోబర్11:అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అలిరాజ్‌పేటలో స్థానిక నాయకులతో కలిసి గ్రామానికి చెందిన రైతు సత్తిరెడ్డి పత్తి పంటను పరిశీలించారు. ఎకరాకు రూ.15వేల చొప్పున కౌలుకు తీసుకొని పెట్టుబడులతో కలిపి దాదాపు 15ఎకరాలకు రూ.8లక్షల వరకు ఖర్చు చేశామని, కానీ.. అకాల వర్షాలకు తోడు, ప్రభుత్వం సరైన సమయంలో యూరియా అందించక పోవడంతో పంట ఎదగక చెట్టుకు 5 నుంచి 6 కాయలు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటతో ఈ ఏడు ఎకరాకు రూ. 50వేల వరకు నష్ట వాటిల్లిందని రైతులు వంటేరు ప్రతాప్‌రెడ్డికి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్తి పంట చేతికొచ్చినా నేటికి 25 పత్తి మిల్లులు ప్రారంభించలేదన్నారు. దీంతో రైతులు దళారులకు రూ.5 వేలకు క్వింటాల్ చొప్పున అమ్ముకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పత్తి పంట వేసినా రైతులకు సరైన దిగుబడులు రాక, ఆశించిన ధర లేక తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదన్నారు. పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదని, రైతుబంధు అందించడం లేదని విమర్శించారు. పంటలు చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు.
రేవంత్ అసమర్థ పాలనలో అన్నివర్గాల ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. ఏఒక్క వర్గం సంతృప్తిగా లేరన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, అయినప్పటికీ 22 నెలల పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం చేసిందని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచులు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్త కవిత, కిరణ్‌గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, మాజీ మండల కోఆప్షన్ మెంబర్ ఎక్బాల్, నాయకులు మహేశ్, యాదగరి, శ్రీనివాస్, సత్తిరెడ్డి,సురేశ్ తదితరులు పాల్గొన్నారు.