రాయణఖేడ్, అక్టోబర్ 11: గంజాయి క్షేత్రాలపై దాడులకు వెళ్లిన ఎక్సైజ్ జిల్లా టాస్క్ఫోర్సు అధికారులపై తండావాసులు దాడులకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాలో పత్తిలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం దాడులు జరిపారు. ఈ క్రమంలో తండాకు చెందిన జానకిరామ్ చేనులో 64 గంజాయి మొక్కలను గుర్తించడంతో పాటు మోహన్, దశరథ్ వద్ద నాలుగు కిలోల ఎండు గంజాయి, 1.5 కిలోల గంజా యి విత్తనాలు, టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సందర్భంలో తండావాసులంతా మూకుమ్మడిగా టాస్క్‌ఫోర్స్ అధికారులను దుర్భాషలాడుతూ దా డికి తెగబడ్డారు.
టాస్క్‌ఫోర్స్ సీఐలు శంకర్, రఘునాథ్‌రెడ్డి, ఎస్సైలు హనుమంత్, అనుదీప్, వహీద్ సహా పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు నారాయణఖేడ్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన నారాయణఖేడ్, సిర్గాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గంజాయి నిందితులు సహా అధికారులపై దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. తండా లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం తండాను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
గంజాయి క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో తమ విధులను అడ్డుకుని తమపై దాడికి పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ చాందిబాయి తనయుడు రమేశ్ చౌహాన్, బన్సీలాల్, రాణాప్రతాప్‌తో పాటు మరో 15 మంది ఈ దాడి ఘటనలో బాధ్యులుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.
టాస్క్ఫోర్సు అధికారుల తనిఖీలు సజావుగా సాగుతున్న తరుణంలో తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీపీ చాందిబాయి తనయుడు రమేశ్ చౌహాన్ అక్కడికి చేరుకుని తండావాసులను అధికారులపై ఉసిగొల్పడం మూలంగానే దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే స్వయంగా అధికారులను దుర్భాషలాడుతూ దురుసుగా వ్యవహరించడం మూలంగానే తండావాసులు రెచ్చిపోయి దాడులకు దిగినట్లు తెలుస్తుంది. నిందితులు అధికారుల చేతికి చిక్కకుండా ఆయనే తప్పించినట్లు చెప్పుకొంటున్నారు. ఇంత చేసినా ఆయన తన ప్రమేయం లేనట్లు చూడాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.