Chhattisgarh | రాయ్పూర్ : ఈ భూమ్మీద పర్యావరణ ప్రేమికులు చాలా మందే ఉన్నారు. పర్యావరణం దెబ్బతినొద్దనే ఉద్దేశంతో చాలా మంది మొక్కలను నాటుతుంటారు. అవి పెద్దగా అయిన తర్వాత కూడా వాటికి సంరక్షిస్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారలు మాత్రం ఆ చెట్లను క్షణాల్లో నరికేస్తుంటారు. ఓ వృద్ధురాలు 20 ఏండ్లుగా కన్న బిడ్డను పెంచినట్టు ఓ చెట్టును పెంచి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఆ చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చెట్టు వద్దకు వెళ్లి గుండెలవిసేలా రోదించింది.
ఛత్తీస్గఢ్ ఖైరాగర్హ్ జిల్లాలోని సరగొండి గ్రామానికి చెందిన 85 ఏండ్ల వృద్ధురాలు డియోలా భాయ్ పర్యావరణ ప్రేమికురాలు. ఆమె గత 20 ఏండ్ల నుంచి ఓ రావి చెట్టును కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నబిడ్డ కంటే ఎక్కువగా దాన్ని చూసుకుంటుంది. ఈ చెట్టు ఉన్న భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో చెట్టును నేలమట్టం చేసి భూమిని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇమ్రాన్ మెమన్తో పాటు అతని అనుచరులు కలిసి రావి చెట్టును నరికేశారు. గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ వారిని కూడా బెదిరింపులకు గురి చేశారు.
కబ్జాదారులు అటు నుంచి వెళ్లిపోయిన తర్వాత డియోలా భాయ్.. ఆ రావి చెట్టు వద్దకు వెళ్లి గుండెలవిసేలా రోదించారు. గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు. ఈ రావి చెట్టుకు తాము నిత్యం పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి భారీ వృక్షాలను నేలకూల్చడం సరికాదని మండిపడ్డారు.
సరగొండి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రావి చెట్టును నరికేసినట్లు ఇమ్రాన్ అంగీకరించాడు. తాను ఈ చెట్టు ముందు ఉన్న భూమిని కొనుగోలు చేశానని, చదును చేసేందుకు చెట్టును నరికేయాల్సి వచ్చిందని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కన్న బిడ్డలా పెంచిన చెట్టును నరికేయడంతో గుండెలవిసేలా దొరించిన వృద్ధురాలు
ఛత్తీస్గఢ్ – సరగొండిలో 20 ఏళ్ల క్రితం ఓ తల్లి ప్రేమతో నాటి పెంచిన చెట్టును నరికేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
బిడ్డలా పెంచిన చెట్టు కళ్లెదుటే నేలకూలడంతో గుండెలవిసేలా రోదించిన వృద్ధురాలు pic.twitter.com/0R3jqVbPep
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2025