మనోహరాబాద్, అక్టోబర్ 11: రూ. 33 లక్షల విలువ చేసే సిగరేట్ ప్యాకెట్ల చోరీ జరిగిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ… మనోహరాబాద్ మండలం దండుపల్లిలోని ఐటీసీ పరిశ్రమలో జీడిపల్లికి చెందిన మైదరబోయిన శ్రీకాంత్, కొనాయిపల్లి పీటీకి చెం దిన చెట్టి మహేశ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దిరు వ్యసనాలకు బానిసై అప్పులు, వాహనాల ఈఎంఐలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేస్తున్న ఐటీసీ గోదాంలో అమెరిక్ క్లబ్, గోల్డ్ ప్లాక్ బ్రాండ్లకు సంబంధించిన సిగరేట్ బాక్సులను దొంగిలించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు.
గోదాంలో భద్రతా లోపాలను గమనించి మూడుసార్లు దొంగతనానికి పాల్పడ్డారు. మొదటిసారి గతేడాది డిసెంబర్ 8న లోడ్ అయ్యి ఛార్జింగ్ పాయింట్లో ఉన్న ఈవీ టాటా ఏస్ వాహనంలో ఉన్న లోడ్‌ను తాళం పగులగొట్టి రూ. 8,30,000 విలువైన సిగరేట్ల ప్యాకెట్లను దొంగలించి, వాటిని బయటి మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తిరిగి అదే తరహాలో మే 18న రూ. 15 లక్షల విలువైన సిగరెట్లను దొంగతనం చేసి విక్రయించారు. చివరిగా సెప్టెంబర్ 21న సుమారు రూ. 10 లక్షలు విలువ చేసే సిగరేట్ల ప్యాకెట్లను దొంగలించి, కొనాయిపల్లి పీటీలోని చెట్టి మహేశ్‌కు చెందిన పొలంలో దాచిపెట్టి, తప్పుడు వివరాలతో రిటైర్లకు విక్రయిస్తున్నారు. ఇలా వచ్చిన రూ. 18,64,0 00 డబ్బును సమానంగా పంచుకున్నారు.
శనివారం నిందితులు దొంగలించిన సిగరేట్ల ప్యాకెట్లను ఓ వాహనంలో తరలిస్తుండగా మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీల్లో పట్టుబడ్డాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో విచారణ చేపట్టగా, నిందితులు నేరాన్ని అంగీకరించారు. వీరి వద్ద నుంచి మూడు మినీ ట్రక్కులు, రూ. 10 లక్షల విలువ చేసే సిగరేట్ ప్యాకెట్ల సంచులు, రూ. 8 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్ఐ సుభాష్‌గౌడ్, సిబ్బంది గోవర్ధన్, రాధాకృష్ణా, భిక్షపతి, నరేందర్‌గౌడ్, సురేశ్‌ను ఎస్పీ అభినందించారు.