KTR | ఒక అల్పుడు.. న్టీ రామారావు చెప్పినట్టు ఒక అంగుష్ఠ మాత్రుడు.. ఒక తుచ్చుడు ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల, ఈ రాష్ట్రం దురదృష్ణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంతటి అల్పుడైనా.. ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుడిని అనే మెడలో బోర్డు వేసుకుని తిరుగడు. కానీ రేవంత్‌రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు మీదనే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటడన్నారు.
దివాళా తీశాం.. దివాళా తీశాం.. ఒక్కసారి కాదిది. రెండున్నరేళ్లలో ఒకసారి తెలంగాణను ఎయిడ్స్ రోగి అంటడు. ఇంకోసారి క్యాన్సర్ పేషంట్ అంటడు.. దివాళా తీసిందని మాట్లాడిన దివాళాకోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవమేంటంటే ఇంతటి భావదారిద్య్రం బహుశా దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. మీ అదృష్టం బాగుంది.. జాక్‌పాట్ కొట్టారు. ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు. మీకు అవకాశం ఇచ్చారు. 30 నెలలు అయిపోయింది.. మీ పరిపాలనకు 50 శాతం మీకిచ్చిన అవకాశం అయిపోయింది.. ఇప్పటికైనా ప్రజలకు మీ ప్రభుత్వంలో మీరేం చేశారో నాలుగు మంచి మాటలు చెప్పండని కేటీఆర్ హితవు పలికారు.
ఢిల్లీకి పోతే గౌరవం లేదని చెప్తడు..
ప్రజలకు మీరిచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. లేదంటే ఒక జిల్లాకు పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి.. మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తున్నం. కానీ ఇంత రాజకీయ భావదారిద్య్రం, ఇంత విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇలా ఉండడు.. ఎంతో మందిని చూశాం.. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులను చూశాం.. కానీ ఎవరిలో కూడా ఇంతటి భావదారిద్య్రం మేమైతే చూడలేదు. తింటున్న అన్నంలోనే మన్ను పోసుకున్నట్టు.. తింటున్న అన్నంలోనే ఊంచినట్టు నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్నే తిట్టడం ఏం దరిద్రం. ప్రభుత్వానికి అధినేత, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు. ఇంకా ఎన్ని రోజులు ఆ విషం చిమ్మే పని మాకైతే అర్థం కావడం లేదన్నారు.
ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు.. అక్కడ గౌరవం లేదని ఆయనే చెప్తడు. మరి 72 సార్లు ఎందుకు పోతున్నవ్. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకూ సాధించని రికార్డు నువ్వే సృష్టించినవ్. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం రెండున్నర సార్లు ఢిల్లీకి పోతున్నవ్. ఎవరు రమ్మంటున్నరు మరి.. నిన్ను అక్కడ.. ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నవ్ అని అడుగుతున్నానన్నారు.