Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘వారణాసి’ (Varanasi) గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి ఈ వారణాసి సినిమా విషయాలపై స్పందించాడు. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, కేవలం 80 రోజుల టాకీ, చిన్నపాటి బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఆయన స్పష్టం చేశారు. నిర్మాత పక్కనే ఉన్నందున ఎక్కువ విషయాలు చెప్పలేనని నవ్వుతూనే, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026 కల్లా పూర్తి షూటింగ్‌ను ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, అనుకున్న సమయానికే అంటే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమా కథాంశం గురించి వస్తున్న అప్డేట్స్ ప్రకారం, ఇది ఒక శివ భక్తుడి చుట్టూ తిరిగే అద్భుతమైన టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ డ్రామా. విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఒక అద్భుత వస్తువును కనుగొనడానికి శతాబ్దాల కాలంలో సాగే ప్రయాణమే ఈ చిత్రం. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే ప్రధాన పాత్రతో పాటు ఒక ప్రత్యేక ఎపిసోడ్లో ‘శ్రీరాముడి’గా కూడా కనిపించనున్నారు. అలాగే ప్రియాంకా చోప్రా ‘మందాకిని’ పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, రాజమౌళి దీనిపై క్లారిటీ ఇస్తూ.. ‘వారణాసి’ రెండు భాగాలుగా కాకుండా సుమారు మూడు గంటల నిడివి గల ఒకే ఒక్క భారీ చిత్రంగా థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. మరోవైపు ‘బాహుబలి 3’పై కూడా ఇటీవల ఇండస్ట్రీలో చర్చ నడుస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి రాజమౌళి పూర్తి ఫోకస్ అంతా ఈ ‘వారణాసి’ చిత్రంపైనే ఉందని, 2027 ఏప్రిల్ రిలీజ్ టార్గెట్‌తో శరవేగంగా పనులు జరుగుతున్నాయని సమాచారం.