అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పాలన వ్యవస్థ అంతా నిర్వీర్యమయ్యిందని , రెడ్ బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ( Violation of human rights ) జరుగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి YS Jagan Mohan Reddy) ఆరోపించారు. జంగల్ రాజ్ ఎక్కడో బీహార్ లో లేదు. ఆంధ్రాలోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ అంశంపై మాట్లాడుతూ మే 6న సాయికృష్ణ అనే యువకుడిని మార్కాపురం నుంచి తీసుకువచ్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తే అక్కడ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో లాకప్‌డెత్‌కు గురయ్యారని ఆరోపించారు. తన కుమారుడిని లాకప్‌డెత్ చేశారని ఆరోపిస్తూ విజయవాడ సీపీకి, డీజీపీకి తల్లి ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాన బాధితుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించి పోలీసుల తీరును ప్రశ్నించినా తరువాతే ప్రభుత్వం స్పందించిందన్నారు.ఈ కేసులో సీఐ, సీపీ, డీజీపీ, చంద్రబాబును సైతం బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో సీసీఫుటేజ్ పనిచేయడం లేదంటూ ఆధారాలను, సాక్ష్యాలను మాయం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఫుటేజ్ డిలీట్ చేయడం చేస్తే కామెంట్ కంట్రోల్ సెంటర్లో రికార్డులు ఉంటాయి కదా ? సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్టు చేసి, పెద్దవారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.మరో ఘటనతో సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని , న్యాయవ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నారని వెల్లడించారు. గత రెండేళ్లుగా రెడ్ బుక్కు పాలన కొనసాగుతూ ఉండటం వల్ల నేరాల సంఖ్య పెరిగిందన్నారు.
చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు ..
అమరావతిలో రైతులను పరామర్శించేందుకు వెళితే వైసీపీ నాయకులుపై దాడి చేసి కేసు నమోదు చేయడం విచిత్రమని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులవుతున్నారని ఆందోళనవ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నైతిక విలువలు, పశ్చాతాపము లేదని అన్నారు. భూములు ఇవ్వని అమరావతి రైతులపై చంద్రబాబు అనేక ఇబ్బందుల గురిచేస్తున్నాడని ఆరోపించారు. రైతుల బాధలను తెలుసుకునేందుకు వెళ్లిన వైసిపి ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు నాయకులపై దాడులకు దిగి వారిని రౌడీలుగా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
విలన్లు సినిమాలో లేరని,చంద్రబాబు చూస్తే నిజమైన విలన్‌గా గుర్తుకు వస్తున్నారని మండిపడ్డారు.ఎన్టీఆర్ బ్రతికుండి చంద్రబాబును ప్రశ్నిస్తే ఎన్టీఆర్‌ను, లక్ష్మి పార్వతిని కూడా రౌడీలని అనేవారని విమర్శించారు. అమరావతి పేరిట జరుగుతున్న అరాచకాలు దోపిడీలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రతి దాడులు చేస్తున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు .