Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలవు దినం అయినప్పటికీ, పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు ఆఫీసుల నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో వర్షం కురియడంతో ఇబ్బంది పడ్డారు.
ఇక ఉదయం నుంచి హైదరాబాద్ నగరమంతా ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తుండడంతో నగరవాసులు చలికి వణికిపోయారు. కొందరైతే ఆ గాలులను ఎంజాయ్ చేశారు. ఇక సాయంత్రం సమయానికి హయత్ నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, రాంనగర్, ఓయూ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకాపూల్, మెహిదీపట్నం, కొండాపూర్, హైటెస్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి.. కిమ్స్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీశ్‌రావు
Errolla Srinivas | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు