శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 19, 2020 , 00:05:13

వానాకాలం వ్యాధులపై యుద్ధం చేద్దాం...

వానాకాలం వ్యాధులపై యుద్ధం చేద్దాం...

  • నియంత్రణ చర్యలను 5 రెట్లు పెంచండి 
  • లార్వా సంహారక ద్రావణాన్నిఐదు రోజులకోసారి పిచికారీ చేయండి 
  • అదనంగా ఫాగింగ్‌ యంత్రాలను తెప్పించండి 
  • కాలనీ సంఘాలు, అపార్టుమెంట్ల వాసులతో 19 నుంచి సమావేశాలు నిర్వహించండి
  • డెంగీ, స్వైన్‌ ఫ్లూ పై ప్రజలను చైతన్య పర్చండి
  • రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడండి 
  • మరో 44 బస్తీ దవాఖానలు త్వరలోనే ప్రారంభం 
  • జీహెచ్‌ఎంసీ అధికారుల సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 
  • కరోనా నియంత్రణలో బల్దియా సేవలు ప్రశంసనీయం 
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల  

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న పారిశుధ్యం, స్ప్రేయింగ్‌ కార్యక్రమాలను ఐదు రెట్లు పెంచాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కే.టీ. రామారావు అధికారులను ఆదేశించారు. హైరిస్క్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి       ఇంటెన్సివ్‌ శానిటేషన్‌, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేయాలని కోరారు. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయాలని ఈవీడీఎం విభాగానికి సూచించారు.     తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్న పనులు చేపట్టేందుకు డిప్యూటీ కమిషనర్లకు ఆర్థికపరమైన అధికారాలు కల్పించాలని కమిషనర్‌ను ఆదేశించారు.

హైదరాబాద్  : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎంటమాలజీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సాధారణ పౌరుడి కోణంలో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగంలో 2,412మంది సిబ్బంది పనిచేస్తున్నారని, యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్‌ నిర్వహణకు దాదాపు 2200 యంత్రాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఆయా జోన్లలో ఉన్న పరిస్థితులను బట్టి స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్ల సహకారంతో అదనపు ఫాగింగ్‌ మిషన్లను తెప్పించి ప్రతి ఐదురోజులకు ఒకసారి చొప్పున నెలకు ఐదు విడుతలు యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేయించాలని జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు. హైరిస్క్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇంటెన్సివ్‌ శానిటేషన్‌, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేయాలని కోరారు. 

ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి

సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలన్నారు. సర్కిల్‌ స్థాయిలో కన్వర్జెన్సీ మీటింగ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకుఅనుగుణంగా ఈనెల 19నుంచి వారంపాటు కాలనీ/అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించి దోమలతో వచ్చే డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, చికున్‌గున్యా తదితర వ్యాధులపై చైతన్యపర్చాలని డిప్యూటీ కమిషనర్లను మంత్రి కోరారు. మరో నెలరోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటినుంచే దోమల నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, అంతేకాకుండా ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 

ప్రధాన నాలాల్లో పూడికతీతకు యంత్రాలు

 54 ప్రధాన నాలాల్లో పూడిక తొలగించేందుకు యంత్రాలను వినియోగించాలన్నారు. చెరువులు, కుంటల్లో పెరిగిన గుర్రపు డెక్కను తొలగించుటకు ప్రతి జోన్‌కు ఒక ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ మిషన్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. అవసరమైతే హెచ్‌ఎండీఏ నుంచి కూడా ఈ యంత్రాలను తీసుకోవాలని సూచించారు. వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను గుర్తించి నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లపై ఏర్పడుతున్న గుంతలను పూడ్చేందుకు ఇన్‌స్టెంట్‌ రిపేర్‌ టీమ్స్‌ ను వెంటనే రంగంలోకి దింపాలని ఆదేశించారు. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మ్యాన్‌హోల్స్‌పై ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వర్షపునీరు ఉధృతంగా ప్రవహించే ఓపెన్‌ నాలాలకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు జీడిమెట్ల, ఫతుల్లగూడలో నెలకొల్పిన ప్లాంట్లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

44బస్తీ దవాఖానలు త్వరలో ప్రారంభం

ప్రస్తుతం ఉన్న 123 బస్తీ దవాఖానలకు అదనంగా మరో 44 దవాఖానలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే బస్తీ దవాఖానలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆదేశించారు.  ప్రైవేట్‌ ఖాళీ స్థలాల్లో(ఓపెన్‌ ప్లాట్లు) పేరుకుపోయిన ఘన వ్యర్థాలను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి అయ్యే ఖర్చును సంబంధిత ప్లాట్‌ యజమాని నుంచే వసూలు చేయాలని స్పష్టం చేశారు.

 కరోనా నియంత్రణలో మున్సిపల్‌ సిబ్బంది సేవలు భేష్‌- మంత్రి ఈటల రాజేందర్‌

కరోనా నియంత్రణలో రెండున్నర నెలలుగా వైద్య సిబ్బందితో కలిసి మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు విశేషంగా సేవలు అందిస్తున్నారని మంత్రి ఈటల కొనియాడారు. వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం కాబట్టి వచ్చే సీజన్‌లో వ్యాధుల నివారణ కోసం మంత్రి  కేటీఆర్‌ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అందరినీ సమాయత్తం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌ బోర్డు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అర్వింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, వాటర్‌బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిషోర్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజీత్‌ కంపాటి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


logo